కొరియాకు చెందిన పోస్కో పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఎన్నో ఏళ్ల ఉద్యమంతో విశాఖలో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను అడ్డగోలుగా అప్పగించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా ఎంవోయూ కూడా కుదుర్చుకున్నాయి. పోస్కో ప్రతినిధులు ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు విశ్వప్రయత్నాలు చేసి చివరకు కేంద్రం సహకారంతో విశాఖలో పాగా వేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. పోస్కో పరిశ్రమ నెలకొల్పేందుకు కనీసం మూడు వేల ఎకరాల భూమిని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అంత స్థలం ఒకే చోట సమీకరించి ఇవ్వలేక చేతులెత్తేశాయి. ఒడిశాలో స్థల సేకరణ కోసం ప్రభుత్వం ముందుకు వచ్చినా అక్కడ గిరిజన తెగల నుంచి ఎదురయిన వ్యతిరేకతతో తోక ముడవాల్సి వచ్చింది. అదే విధంగా jharkhand’ రాష్ట్రంలోనూ ప్రయత్నాలు చేసి విఫలమైంది.
ఉక్కు శాఖ మంత్రిగా..
కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించాక ఆంధ్రాలో పోస్కో పరిశ్రమ నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఆయన ఆదేశాల మేరకు పోస్కో ప్రతినిధులు పలుమార్లు స్టీల్ ప్లాంట్ సందర్శించి ఇక్కడి భూములను పరిశీలించారు. ఈ విషయాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచన చేసినట్టు సమాచారం. అయినప్పటికీ ఉక్కు ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఈ విషయాన్ని పసిగట్టడంతో ఆందోళన బాట పట్టాయి. ఈ సమయంలో యాజమాన్యం… కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చింది. సంఘాలతో సంప్రదించకుండా ఎటువంటి అడుగులు ముందుకు వేయబోమని స్పష్టం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పలుమార్లు చర్చలు జరిపింది. పరిశ్రమ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని హామీ తీసుకున్నాక పోస్కో యాజమాన్యం ముందడుగు వేసింది. పోస్కో ప్రతినిధులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చలు జరిపిన దృశ్యాలను శుక్రవారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రదర్శించారు. చేసిందంతా చేసి డ్రామాలు ఆడుతారా? అని ఆయన ప్రశ్నించారు. పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే లేఖలు రాయడం ఏంటని నిలదీశారు.
Must Read ;- జగన్‌కు పోస్కోకు విజయసాయిరెడ్డే మధ్యవర్తి.. ఆధారాలు ఉన్నాయన్న అయ్యన్నపాత్రుడు
వేల కోట్ల భూములు దారాదత్తం..
విశాఖలో పోస్కో నెలకొల్పే స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల ఎకరాల భూములను కేటాయించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఆ భూములు RINL నుంచి తీసుకోవాలని స్పష్టం చేసింది. పరిశ్రమ ఏర్పాటు చేసి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ నెలకొల్పుతామని పోస్కో ప్రతినిధులు ప్రకటించారు. ఈ పరిశ్రమ వాటాలో 50 శాతం తమకే కావాలని షరతు విధించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇక్కడ ఎకరా భూమి రూ.5 కోట్లకు పైనే ఉంది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటే రూ.10 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన పోస్కోకు కేటాయించే భూమి విలువ లక్ష కోట్ల పైనే ఉంటుంది. ఎటువంటి అల్లర్లకు, వివాదాలకు తావు లేని భూమిని అప్పగిస్తున్న సంస్థకు ఎంత వాటా ఇస్తారో స్పష్టం చేయలేదు కానీ.. పోస్కోకు మాత్రం 50 శాతం వాటా కావాలని ముందే పేర్కొన్నారు. ఈ లెక్కన పోస్కో పెట్టుబడి రూపంలో రెండింతలు పెడుతుందా? అంటే భూమి విలువలో పది శాతం కూడా ఉండదు. మరి అటువంటి పరిశ్రమకు ఈ భూములు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అంగీకరించింధో అంతుచిక్కడం లేదు.
ఇదో పెద్ద భూ కుంభకోణం..
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ కుంభకోణానికి పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన ఈ ఆరోపణ చేశారు. వాస్తవ పరిస్థితులు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. “ధర్మేంద్ర ప్రధాన్‌కు పోస్కో మీద అంత ప్రేమ ఉంటే… ఒడిశాలోనే ఆ పరిశ్రమను నెలకొల్పుకోవచ్చు” అని మంత్రి ముత్తంశెట్టి సలహా ఇచ్చారు. కానీ స్థానిక ప్రభుత్వం… ప్రజలు ఆ పరిశ్రమను ఆహ్వానించకపోవడంతో వ్యక్తిగత లాభాలు అజెండాతో ఆంధ్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం జరుగుతోంది. పోస్కో పరిశ్రమల ప్రతినిధులు విధించే షరతులు వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ ఉండదని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తమకు చెప్పకుండా ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని ప్రకటించి… ఎలా ఎంఓయూ కుదుర్చుకున్నారని ఉద్యోగులు, కార్మికసంఘాలు ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- స్టీల్ ప్లాంట్ ను తల్లిలా కాపాడుకుంటాం
100 ఎకరాలు ఇచ్చేందుకు నిరాకరణ..
గత ప్రభుత్వ హయాంలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా స్టీల్ ప్లాంట్ భూములను తీసుకుని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని భావించింది. ఇందుకోసం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు లేఖ రాసినా ససేమిరా అంది. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామన్నా కేటాయించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ప్లాంట్ భవిష్యత్తు విస్తరణ కోసం ఉంచుకున్న భూముల్లో నాలుగు వేల ఎకరాలు పరాయి దేశం సంస్థకు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వాలు ఎలా అంగీకరించాయంటూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్వాసితులకు మొండిచెయ్యి..
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం పంట పొలాలను, తమ జీవనాధారాన్ని త్యాగం చేసి భూములు ఇస్తే… నేటికీ కొందరు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు లభించలేదు. సుమారు 8 వేల మంది నిర్వాసితులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. తరాలు మారిపోతున్నా… నిర్వాసిత కుటుంబాలకు మాత్రం వివిధ కారణాలతో ఉపాధిని దూరం చేస్తున్నారు. మరి ఇవే భూములను ప్రైవేటు సంస్థకు ఇస్తే నిర్వాసితుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. పోస్కో సంస్థను అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అక్కున చేర్చుకున్నాయి.
Must Read ;- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజాగాయకుడు దేవిశ్రీ ఆట .. పాట