‘ఇంత దుర్మార్గమైన ఎన్నికలను తాను ఎప్పుడూ చూడలేదని, బలవంతపు ఏకగ్రీవాలతో వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నా.. ఎస్ఈసీ చేష్టలుడిగి చూస్తూండిపోతోందని మండిపడ్డారు. గురువారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో 83 పంచాయతీలుంటే కేవలం 3 పంచాయతీల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. సగం చోట్ల అసలు నామినేషన్లే వేయనివ్వలేదు. మిగిలిన చోట్ల వేసిన నామినేషన్లను అధికారులతో తిరస్కరింపజేశారు. ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లెలోనూ 22 పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు గాను 76 పంచాయతీల్లో ఏకగ్రీవమైనట్లు చూపిస్తున్నారు. పోలీసు అధికారులను ముందు పెట్టుకుని.. ప్రతిపక్షాలను భయోత్పాతానికి గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుపడడం.. వేసిన నామినేషన్లను తిరస్కరించడం చేస్తున్నారు. ఇలాంటి అరాచకాలను ఎదుర్కొంటాం’’ అని స్పష్టం చేశారు.
ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాలను పిలిపించి ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఈసీ.. కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తోందే తప్ప.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే అడ్డుకోలేకపోతోందని ఆక్షేపించారు. గవర్నర్ కూడా ఈ అక్రమాలపై స్పందించకుండా.. చోద్యం చూస్తున్నారని అన్నారు.
‘ఎంపీటీసీ ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. అక్కడి స్థానిక అధికారులందరినీ మార్చి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఎస్‌ఈసీ ప్రకటించింది. కానీ మార్చలేకపోయింది.ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. వీటిపై తాము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అయినా ఫలితం లేకపోయింది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడడంలో ఎస్‌ఈసీ విఫలమైంది. అందుకే హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ అక్రమాలను కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం’ అని చంద్రబాబు తెలిపారు.
Must Read ;- ఎన్నికల నియమావళికి కట్టుబడాల్సిందే.. మంత్రి పెద్దిరెడ్డి పిటీషన్‌పై హైకోర్టు తీర్పు