Zika Virus Spread In Kerala :
ఇప్పటికే కరోనా కేసులతో ఇబ్బందులు పడుతుంటే.. మరో వైరస్ జికా విస్తరిస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖం తగ్గుతున్న క్రమంలో దేశంలో జికా కేసులు వెలుగుచూస్తుండం ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రమైన కేరళలో జికా కలకలం రేపుతోంది. ఇప్పటికే అక్కడ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఐదుగురికి జికా సోకినట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. చాపకింద నీరులా జికా విస్తరిస్తుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. కరోనా కేసులతో పాటు జికా నుంచి బయటపడేందుకు ఈనెల 17,18 తేదీల్లో లాక్ డౌన్ నిర్వహించనుంది.
జికా లక్షణాలివే..
జికా వైరస్ ప్రాణాంతకం కాకపోయినా.. వ్యాధి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది. జ్వరం, దద్దుర్లు, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలు బాధిస్తాయి. ఇక చిన్నపిల్లలకు జికా సోకితే.. వాళ్లలో ఎదుగుదల లోపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. జికా వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాలేదు. దోమ కాటుకు గురికాకుండా కాపాడుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమ మార్గం. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా, నీరు నిలవకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దోమలను వికర్షించే లేపనాలు వాడాలి. చిన్న పిల్లలకు దోమతెరలను వాడాలి.
జికా అంటే ఏమిటి?
డెంగ్యూ, మలేరియా మాదిరిగానే జికా కూడా ఒక రకమైన వైరస్. దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం. మొదట ఇతర దేశాలకే పరిమితమైన జికా భారత్ కు సైతం పాకింది. సాధారణంగా ఈ వైరస్ ఈడెస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. జికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
Must Read ;- ‘డెల్టా’ ప్రమాదకరం.. వ్యాక్సిన్ తీసుకుంటే కొంతవరకు సురక్షితం