అమరావతి రాజధానిని గుట్టుచప్పుడు కాకుండా విశాఖ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారా? విశాఖలో హడావుడి చూస్తే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విశాఖ నగరంలో ప్రధాన రహదారిని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా రహదారులు వెడల్పు చేయడంతో పాటు, ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయడం రాజధాని తరలింపులో భాగమేనని భావిస్తున్నారు. వచ్చే నెలలోనే పాలన విశాఖ నుంచి కొనసాగించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తోంది.
మరి కేసుల సంగతేంటి..
అమరావతి రాజధానిపై హైకోర్టులో 67 కేసులు విచారణలో ఉన్నాయి. కోర్టు సెలవుల కారణంగా నెల రోజుల నుంచి విచారణ చేపట్టలేదు. ఈ నెలలో రాజధాని కేసులపై విచారణ చేపట్టనున్నారు. అయితే తీర్పు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పులతో పని లేకుండానే అమరావతి రాజధానిని విశాఖ తరలించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా రాజధాని తరలింపు అని చెప్పకుండా, సీఎం ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చనే సూత్రం ఆధారంగా విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయం మార్చాలనే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి బొత్స ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని ఆయన మీడియాకు వెల్లడించారు. అంటే పాలనా రాజధాని విశాఖకు తరలిపోతోందనే సంకేతాలకు మంత్రి బొత్స మాటలు బలం చేకూరుస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిషాను కలిసింది అందుకేనా..
అమరావతిలోని హైకోర్టును కర్నూలుకు తరలించాలని, ఇందుకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వారం కిందట కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి విన్నవించారు. హైకోర్టు తరలింపుతో పాటు, మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. అంటే విశాఖకు రాజధాని తరలింపునకు కేంద్రం ఎలాంటి అడ్డంకులు పెట్టకపోయినా, వారి మద్దతు కోరుతున్నారు. ఇక విశాఖకు ముందుగా సీఎం క్యాంపు కార్యాలయం తరలిస్తే మిగిలిన కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఇలా ఈ ఏడాది చివరి నాటికి పాలన మొత్తం విశాఖ నుంచి కొనసాగించాలని సీఎం ఆదేశించారని, ఇందులో భాగంగానే విశాఖలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ప్రజల దృష్టి మరలించేందుకేనా..
కరోనాతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియాలో ఇవే కథనాలు, ప్రభుత్వ వైఫల్యాలు తరచూ వస్తున్నాయి. దీంతో కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందనే వార్తలు ప్రాచుర్యం పొందాయి. దీంతో వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందనే కథనాలు పెద్దలకు రుచించడం లేదని, దీంతో మరలా రాజధాని తరలింపుపై మంత్రి బొత్సతో ప్రెస్ మీట్ పెట్టించారనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఏది ఏమైనా ఏపీలో రాజధాని అంశం చదరంగాన్ని తరలిస్తోంది. మూడు రాజధానుల అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఎలాగూ రాజధాని నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేయడం వల్లే రాజధాని నిర్మించలేకపోయామని ప్రచారం చేసుకునేందుకే వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలో కనీసం ఒక్క కార్యాలయం కూడా నిర్మించకుండా రాజధాని తరలింపు అంశం తెరమీదకు తేవడం అంటే ఇదొక రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Must Read ;- అమరావతిపై ఎందుకు అంత ద్వేషం.. పదివేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?