కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు 90 నిమిషాల పాటు జరిగిన భేటీలో పలు అంశాలను చర్చించినట్టు ధిల్లీలో రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రక్రియలో భాగంగా రీనోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.అభివృద్ధిలో సమతుల్యత కోసమే అమరావతి, విశాఖపట్నం, కర్నూలు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. ఈ విధానానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్నామని, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలు చేయబోతున్నామని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మరోసారి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. విభజన సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని, ప్రస్తుత సమయంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి వల్ల రాష్ట్రం పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రత్యేక హోదా ఇస్తే గ్రాంట్ల వల్ల అధిక నిధులు వస్తాయని చెప్పినట్టు తెలుస్తోంది.నిధులతో పాటు భారీ పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమన్నారు. త్వరలో రాష్ట్రంలో 13 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, మరికొన్ని నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సరెండర్‌కు..
ఇక కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్ల నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సరెండర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తాము అధిక ధరలకు ఈ ఒప్పందాలు చేసుకున్నందున సరెండ్ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.325కోట్ల అదనపు భారం పడుతోందని తెలపడంతో పాటు తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.5,541కోట్లు కూడా ఇప్పించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ రంగ సంస్థలు రూ.50వేల కోట్ల రుణాల్లో ఉన్నాయని, వాటి పునర్వ్యవస్థీకరణకు అనుమతివ్వాలని కోరారు. విశాఖ జిల్లా అప్పర్ సీలేరు రివర్స్ విద్యుత్ ప్రాజెక్టుకు అయ్యే రూ.10445కోట్ల వ్యయంలో 30శాతం కేంద్రం భరించాలని విన్నవించారు. ఆత్మనిర్బర్ ప్యాకేజీ కింద తెలంగాణ డిస్కంలకు తగిన రుణ సదుపాయం కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు కేంద్రం నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లుకు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు-2020కి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అమిత్‌షాను ముఖ్యమంత్రి కోరినట్లు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
పీడీఎస్ బకాయిలివ్వండి..
ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రంనుంచి రావాల్సిన రూ.4,652.70 కోట్లను తక్షణమే విడుదల చేయించాలని కోరారు. సంవత్సరంలో ప్రస్తుతం ఉండే పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరారు. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు రూ.529.95 కోట్లు ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి మరో రూ.497 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ నిధులు వెంటనే విడుదల చేయించాలని కోరారు. అంతకుముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ప్రకాశ్ జవదకర్‌తో భేటీ అయి పలు ప్రాజెక్టులపై చర్చించినట్టు అధికారులు తెలిపారు.
Must Read ;- పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి.. సీపీఎస్ రద్దుపై జగన్‌కు రఘురామరాజు మరో లేఖ











