కొవిడ్ వ్యాక్సిన్ల రెండు డోసుల మధ్య గడువు అంశం మరోసారి వివాదాస్పదమైంది. కొవిషీల్డ్ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు మధ్య సమయాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. గతంలో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన రాగా తాజాగా మరోసారి ఆ అంశం తెరపైకి వచ్చింది.
చర్చ ఇదీ..
ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సభ్యుడు మాథ్యూ వర్గీస్ మాట్లాడుతూ పలు అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తరువాత నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ కొవిషీల్డ్ రెండు రోజుల మధ్య ఉండే గడువును 8-12 వారాలకు సిఫారసు చేసిందని, అయితే కేంద్ర ప్రభుత్వం 12-16 వారాలకు పొడిగించిందని వ్యాఖ్యానించినట్టు సదరు పత్రిక పేర్కొంది. అదే సమయంలో మరో సభ్యులు ములియిల్ మాట్లాడుతూ నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ప్రభుత్వానికి 12-16 వారాల గడువుకు సిఫారసు చేయలేదని తెలిపారు. ప్రత్యేకంగా తాము అంత సమయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. కాగా అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుడు అంటోని ఫౌచీ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం శాస్త్రీయంగా ఉండాలని, లేని పక్షంలో కొత్త మ్యుటేషన్ల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉందని, సకాలంలో రెండో డోసు టీకా ఇవ్వకపోవడం వల్లే బ్రిటన్‌లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి జరుగుతోందని ఫౌచీ వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ల రెండు డోసుల మధ్య విరామం 3 లేదా 4 వారాలు ఉండాలని సూచించారు.
కేంద్ర ప్రకటన..
అంటోనీ ఫౌచీ వ్యాఖ్యలు, రాయిటర్స్ కథనం నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు మొదలైన ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్దన్ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతులను, అంశాలను పరిశీలించాకే వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ సమయంపై నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. పూర్తిగా పారదర్శకంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ ట్విట్ చేశారు. ప్రజారోగ్యానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించడానికి భారత్ చాలా పటిష్ఠమైన దశలో ఉందని, అయినప్పటికీ కొందరు ముఖ్యమైన విషయాలను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్ ఛైర్మన్ డా.ఎన్‌కే అరోరా మాట్లాడుతూ డోసుల మధ్య వ్యవధి పెంపు నిర్ణయం పూర్తి శాస్త్రీయతను పరిశీలించాకే వెలువడిందని, నేషనల్ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో వ్యవధి తగ్గించే అవకాశం కూడా ఉందని, కొవిడ్19 వ్యాక్సినేషన్ నిరంతర ప్రక్రియగా మారిందని, వ్యాక్సిన్ల ఫలితాలను బట్టి నిర్ణయాలు మారతాయని, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం కాకుండా వేరే విధానంలో కనీసం 5 నుంచి 10శాతం మెరుగైన ఫలితాలు ఉన్నాయని తేలినా ఆ విధానంపై సమీక్ష జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఓ వైపు భారత్‌లో ఈ పరిస్థితి కొనసాగుతుండగా బ్రిటన్ ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఆస్ట్రాజెనెకా టీకా డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తుండడం గమనార్హం. డెల్టా స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Must Read ;- వృథా చేస్తే కోతే.. టీకాల పంపిణీకి కేంద్రం కొత్త మార్గదర్శకాలు