స్టార్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి టైమింగ్ తో కామెడీ పండిస్తూ.. అప్పుడప్పుడు హీరోగా కూడా చేస్తూంటాడు. ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడి పంబ’ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన అతడు.. ఇప్పుడు మరో సినిమాతో హీరోగా వచ్చేస్తున్నాడు. సినిమా పేరు ‘ముగ్గురు మొనగాళ్ళు’. ఇందులో ముగ్గురు హీరోలు. అందులో ఒకడు గుడ్డివాడు, మరొకడు మూగవాడు, ఇంకొకడు చెవిటివాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
ఇక ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి చెవిటివాడుగా మెయిన్ లీడ్ చేస్తుండగా.. దియా ఫేమ్ దీక్షిత్ శెట్టి మూగవాడిగానూ, వెన్నెలరామారావు గుడ్డివాడు గానూ నటిస్తున్నారు. వీరిలో కామెడీ సైటైర్స్ వేస్తూ నవ్వించే బాధ్యతను శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు. నగరంలో జరగుతున్న వరుస హత్యల కేసును ఈ ముగ్గురు హీరోలు తమ తెలివితేటలతో ఎలా సాల్వ్ చేశారు అన్నదే ఈ సినిమా కథాంశం.
రాజా రవీంద్ర పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. మరో ముఖ్యపాత్రలో దివంగత నటుడు, ఇంటర్వ్యూయర్ టీ.యన్.ఆర్ కనిపిస్తున్నారు. ట్వీషా శర్మ, శ్వేతా వర్మ కథానాయికలు గా నటిస్తున్నఈ సినిమాలో జోష్ రవి, జెమినీ సురేశ్, జబర్దస్త్ సన్నీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ముగ్గురు మొనగాళ్లు మూవీ.. త్వరలోనే విడుదల కాబోతోంది.
Must Read ;- సినిమా టైటిళ్లు దొరికే మాయాబజార్!