అసలు సినిమానే ఓ మాయాబజార్. అలాంటిది మాయాబజారే సినిమా అయితే ఇంకెలా ఉంటుంది. అందుకే నాటికీ నేటికీ ఎవర్ గ్రీన్ ‘మాయాబజార్’ ఒక్కటే. అందుకే ఆ సినిమాలో పలికిన డైలాగుగానీ, పాటల పల్లవిలో మాటలుగానీ ఆ తర్వాతి తరంలో ఏకంగా సినిమా టైటిల్స్ గా మారాయి.
ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా స్ఫూర్తితో ఏయే సినిమాలు వచ్చాయో చూద్దాం. ముఖ్యంగా రచయిత, దర్శకుడు జంధ్యాల మీద ‘మాయాబజార్’ ప్రభావం ఎక్కువని ఆయన సినిమా టైటిల్సే నిరూపించాయి. ఆయనకు ఆ సినిమా అన్నా, అందులోని పాత్రలన్నా ఎంతో ఇష్టం. అందులో నుంచి కొత్త కథల్నీ పాత్రల్నీ సృష్టించి నవ్వులు పూయించారు జంధ్యాల. ఒక్క జంధ్యాల మాత్రమే కాదు చాలామందికి మాయాబజార్ స్ఫూర్తిదాయకమైన సినిమా. మరి అలాంటి సినిమాలు ఏమిటో చూద్దాం. పింగళి నాగేంద్రరావు రచనా విన్యాసం మహిమ అంటే ఇదే.
అహనా పెళ్లంట..
ఇది మాయాబజార్ లోని పాటల పల్లవి నుంచి పుట్టిన టైటిల్. ముఖ్యంగా మహానటి సావిత్రి నటనా వైచిత్రికి అద్దంపట్టిన పాట ఇది. శశిరేఖ పాత్రను పోషించిన సావిత్రి శరీరంలోకి ఘటోత్కచుడు ప్రవేశించి చేసిన అల్లరి నుంచి ఈ పాట పుట్టింది. ఇది తన సినిమా టైటిల్ గా పెడితే బాగుంటుందన్న ఆలోచన జంధ్యాలకు ఎలా వచ్చిందో ఊహించలేం. ఎందుకంటే ఈ సినిమా మూల కథ రచయిత ఆదివిష్ణుది.
ఆయన పల్లకి వార పత్రికలో రాసిన ‘సత్యంగారిల్లు’ నవల ఆధారంగా ఇది తెరకెక్కింది. ఇందులో రాజేంద్రప్రసాద్, రజినీ, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా బ్రహ్మానందంలోని మంచి కమెడియన్ ని పరిచయం చేసిన సినిమా ఇది. అరగుండు బ్రహ్మానందంగా ఆయన అందరికీ సుపరిచితులయ్యారు. మాయాబజార్ లోని ఈ పాట పల్లవిలో నుంచి రెండో లైన్ ‘ఓహో నా పెళ్లంట’ పేరుతోనే జంధ్యాల మరో సినిమా తీశారు.
ఇందులో హరీష్, సంఘవి జంటగా నటించారు. ఈ రెండు సినిమాలకూ రామానాయుడు నిర్మాత. ఇటీవల అల్లరి నరేష్ హీరోగానూ మరోసారి ‘అహ నా పెళ్లంట’ తెరకెక్కింది. ‘అహ నా పెళ్ళంట..’ పాటలో తధోంధోంధోం తధీంధీంధీం అనే బిట్ ని పాడింది మాత్రం మాధవపెద్ది సత్యం కాదు.. దాన్ని మాత్రం ఘంటసాలగారే పాడారు.
వివాహ భోజనంబు
జంధ్యాల వారిని మాయాబజార్ సినిమాలోని ఘటోత్కచుడి పాత్ర ఎంతలా ఆకట్టుకుందో ‘వివాహభోజనంబు’ టైటిల్ ను బట్టే అర్థమవుతోంది. ‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు’ అంటూ ఘటోత్కచుడి పాత్రధారి ఎస్వీ రంగారావుతో ఈ పాట సినిమాలో వస్తుంది. పెళ్లి వారింట పిండివంటల్ని ఆవురావురుమంటూ ఆరగించే సందర్భంలో వచ్చే పాట ఇది. మాధవపెద్ది సత్యం ఈ పాటను పాడారు.
ఇలాంటి పాట నుంచి ఓ కామెడీ సినిమాని పుట్టించవచ్చని జంధ్యాల నిరూపించారు. ఇందులో రాజేంద్రప్రసాద్, అశ్వని జంటగా నటించారు. జంధ్యాల మాత్రం మాయాబజార్ స్ఫర్తితో హాస్య ప్రధానమైన కథలే పుట్టాయి. బహుశా ఆయన ముందు టైటిల్ అనుకుని ఆ తర్వాతే కథలు తయారుచేసుకున్నారేమో అనిపస్తుంది.
చూపులు కలిసిన శుభవేళ..
ఈ సినిమాలు, ఈ టైటిల్స్ చూశాక జంధ్యాల మీద కాపీ ముద్ర వేస్తారేమో. అభిమన్యుడు, శశిరేఖ ప్రేమలో పడి పాడుకొనే సూపర్ హిట్ సాంగ్ ‘చూపులు కలిసిన శుభవేళ.. ఎందుకు నీకు కలవరమూ’.నరేశ్, మోహన్, అశ్వని హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రూపొందింది. ఇది కూడా సూపర్ హిట్ సినిమాగా మారింది. ఈ సినిమాలో వీరభద్రరావు, కోటశ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందంల మధ్య కామెడీ బాగా పండింది. కాకపోతే అకస్మాత్తుగా వీరభద్రరావు చనిపోతే ఆ పాత్రకు జంధ్యాలగారే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో చూపులు కలిసిన శుభవేళ అనే పాటను వీరభద్రరావు, నరేశ్ ల మీద రీమిక్స్ చేయాలన్న ఆలోచన జంధ్యాల వచ్చింది. అది జనానికి బాగా నచ్చింది.
హైహై నాయకా
‘హైహై నాయకా’ అనేది ‘మాయాబజార్’ పింగళి నాగేంద్రరావు పదవిన్యాసం. తన స్థావరంలోకి ఘటోత్కచుడు ప్రవేశించేటప్పుడు ఆయన అనుచరులు చేసే జయ జయధ్వానమే ‘హై హై నాయకా’ అనే పదం. దీన్ని కూడా జంధ్యాలగారు వదిలిపెట్టలేదు. ఇందులో సీనియర్ నరేశ్, జయభారతి జంటగా నటించారు. ఇంట్లో పెద్దలు ఏంచేస్తే పిల్లలు దాన్నే అనుసరిస్తారనే లైన్ ఆధారంగా జంధ్యాల ఈ కథ తయారుచేశారు.
అంతర్లీనంగా సందేశం ఉండేలా జాగ్రత్త పడ్డారు. మాయాబజార్లో పాత్రలు మాట్లాడిన భాష గ్రాంధికంలాగా అనిపించదు. అలాగని వ్యావహారికంగా లాగానూ ఉండదు. ఈ పదాలు మనసుకు ఎంతగానో హత్తుకోబట్టే జంధ్యాలకు ఇలాంటి మంచి సినిమా టైటిల్స్ స్ఫురించాయి అనుకోవచ్చు.
లాహరి లాహిరి లాహిరిలో..
మాయాబజార్ ప్రభావం జంధ్యాల ఒక్కరి మీదే కాదు ఇంకా చాలామంది మీద పడింది అనడానికి ‘లాహరి లాహిరి లాహిరిలో..’ సినిమా టైటిల్ కూడా ఓ ఉదాహరణ. దర్శకుడు వైవిఎస్ చౌదరి తన సినిమాకు పెట్టిన టైటిల్ ఇది. ‘లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా’ అనే పల్లవితో సాగే ఈ పాటను పింగళి గారే రాశారు. ఘంటసాల, లీల పాడారు. అర్జున పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు,
శశిరేఖ పాత్రధారి సావిత్రిల మీద ఈ పాటను చిత్రీకరించారు. హరికృష్ణ, భానుప్రియలతో పాటు మొత్తం మూడు జంటల కథతో వైవిఎస్ చౌదరి ‘లాహిరి లాహిరి లాహిరిలో ’ సినిమాని రూపొందించారు. ఇలాంటి ఆలోచన చౌదరికి రావడం వెనక కారణం ఏమై ఉన్నా సినిమా మాత్రం పెద్ద హిట్టయ్యింది. అది ‘మాయాబజార్’ ప్రభావమే అనుకోవాలేమో. మున్ముందు మరెన్ని టైటిల్స్ మాయాబజార్ నుంచి పుట్టుకొస్తాయో. అసలు మాయా బజార్ అనేదే గొప్ప టైటిల్. మరిన్ని మాయాబజార్ లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
– హేమసుందర్
Must Read ;- ఎన్టీఆర్ ‘లవకుశ’తోనే పాన్ ఇండియాకు భీజం