సినిమా రంగంలో ‘అఆ’లకు ఎంతో ప్రాధాన్యముంది. అందుకేనేమో అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానటుడు అక్కినేని ఆలోచనలను అఆలుగా రాశారు. మనం కూడా ఇప్పుడు ‘అఆ’ల ప్రస్తావనే చేయబోతున్నాం.
అఆ అనగానే ఆనంద్ విహారి, అనసూయ రామలింగంల ప్రేమతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా గుర్తుకొస్తుంది. కానీ ఈ అఆలు అది కాదు. ఆ ‘అఆ’ క్లాస్ టచ్ ఉన్న ప్రేమ కథ అయితే, ఈ ‘అఆ’ మాస్ పిచ్ బరిలోకి దిగుతున్న మసాలా సినిమాలు. అక్కడ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఇక్కడ ఒకరికొకరు పోటీ పడబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఒకరిది సంహ గర్జన, ఇంకొకరిది పులి గాండ్రిపు. వీరిద్దరి ఆటకూ అంపైర్ గా కరోనా వ్యవహరిస్తోంది. అఖండ వర్సెస్ ఆచార్య.. ఇవే ఆ ‘అఆ’లు. పక్కపక్కనే ఉన్న ఈ ఇద్దరు అగ్రహీరోల సినిమాలు పోటీ పడటం తెలుగు సినిమా రంగంలో ఇది మొదటిసారి కాదు.
నవరస నటనా క్షేత్రంలోకి అడుగుపెట్టాక సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ల సినిమాలు బరిలో తలపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలవుతున్నాయి అంటే చెప్పుడు మాటలతో ఆ హీరోల మధ్య పుల్లలు పెట్టేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అందుకే అక్కినేని తన అఆలలో ‘ఎదురుగా పొగిడేవాడు, చాటుగా తెగిడేవాడు విరోధి.. చాటుగా మెచ్చుకునేవాడు ఎదురుగా లోపాలు చెప్పేవాడు స్నేహితుడు’ అంటూ రాశారు. చెప్పుడు మాటలకు హీరోలు దూరంగా ఉంటే వారి మధ్య స్నేహ పూరిత వాతావరణం ఉంటుంది.
బాలయ్య వర్సెస్ చిరు
తెలుగు సినిమా రంగంలో సమకాలికులుగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికీ అగ్రహీరోలుగా ఉన్నవారు చిరంజీవి, బాలకృష్ణ. వయసులో చిరంజీవి పెద్ద అయినా సినిమాల పరంగా మాత్రం బాలకృష్ణ సీనియర్. 1970వ దశకంలో వీరిద్దరూ సినీ రంగం ప్రవేశం చేశారు. సోలో హీరోగా మాత్రం మెగాస్టార్ చిరంజీవే సీనియర్ గా చెప్పాల్సి ఉంటుంది. 1974లో వచ్చిన ‘తాతమ్మకల’ సినిమాతో నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా ‘సాహసమే జీవితం’తో 1984లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
చిరంజీవి విషయం అలా కాదు. 1978లోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకరిది వారసత్వ నటన, ఇంకొకరి స్వయంకృషితో నటనా రంగంలో పయనం. మహానటుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి నప్పటి నుంచి తెలుగు సినిమా రంగంలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ ఉండేవారు. ఇద్దరి సినిమాలూ పోటీ పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాల సంఖ్యపరంగా చిరంజీవి నేటి ‘ఆచార్య’తో 160 సినిమాలు పూర్తి చేస్తే, బాలయ్య ‘అఖండ’తో 106 సినిమాలు పూర్తి చేశారు.
వసూళ్ల పరంగానూ పోటీ..
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వసూళ్ల పరంగానూ రికార్డులు బద్దలు కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 1984లో ఛాలెంజ్, మంగమ్మగారి మనవడు చిత్రాలు దాదాపు నెల రోజుల వ్యవధిలో విడుదలై కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. 1999 జనవరిలో ‘సమరసింహారెడ్డి’, ‘స్నేహం కోసం’ చిత్రాలు విడుదలై కలెక్షన్లు కొల్లగొట్టాయి. అప్పట్లో ‘సమరసింహారెడ్డి’ కలెక్షన్ల పరంగా పాత రికార్డులనన్నిటినీ తుడిచిపెట్టేసింది. 2001లో ‘నరసింహనాయుడు’, ‘మృగరాజు’ చిత్రాలు సంక్రాంతికి విడుదలై పోటీపడ్డాయి.
‘నరసింహనాయుడు’ విజయపథంలో దూసుకుపోయింది. 2017 జనవరిలో ‘ఖైదీనంబర్ 150’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో చిరంజీవి సినిమా కలెక్షన్ల పరంగా పైచేయి సాధించింది. ఇప్పుడు వీరిద్దరి సినిమాల మధ్య అలాంటి పోటీనే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రెండు సినిమాల పేర్లలో సారూప్యం, గెటప్పుల పరంగా వైవిధ్యం, మాస్ అప్పీల్.. ఇవన్నీ ఈ రెండు సినిమాలపై విపరీతమైన అంచనాలు పెంచేలా చేసింది. మే 13న ‘ఆచార్య’, మే 28న ‘అఖండ’ విడుదల కావలసి ఉంది.
ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ‘ఆచార్య’ విడుదల వాయిదా పడినట్లే. ‘అఖండ’ విడుదల వాయిదా పడుతుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమాలు ఎప్పుడు విడుదల కావాలన్న నిర్ణయం కరోనా చేతుల్లోనే ఉంది. కరోనా కరుణిస్తే తప్ప పెద్ద సినిమాలు విడుదలయ్యే వాతావరణం లేదు. దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివలు ఇద్దరూ ఈ రెండు సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే ఈ ‘అఆ’లపై ఈ విశ్లేషణ.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- బాలయ్య మామయ్య లుక్స్ అదుర్స్ : ‘అఖండ’ దుమ్మురేపుతోందని లోకేశ్ ట్వీట్