బాలకృష్ణ సినిమా అనగానే భారీతనం ప్రధాన లక్షణంగా ఉంటుంది. భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ .. భారీ డైలాగులు .. ఇలా అన్నింటిలో భారీతనం తప్పనిసరిగా కనిపిస్తుంది. లేకపోతే ఆయనకే కాదు .. ఆయన అభిమానులు ఎంతో అసంతృప్తిగా ఫీలవుతారు. ఇక బాలకృష్ణ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అది మాటల్లో కావొచ్చు .. పసందైన పాటల్లో కావొచ్చు. అసలు బాలకృష్ణ సినిమాకి ఆడియన్స్ ఏం ఆశించి వస్తారనే విషయం ఏ దర్శకుడికి బాగా తెలుసు? అనే ప్రశ్నకి, బి.గోపాల్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.
బాలకృష్ణ .. బి.గోపాల్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ జాబితాలో ‘నరసింహనాయుడు’ పేరు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మురళీకృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2001 .. జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్ .. ప్రీతీ జింగానియా అందాల సందడి చేశారు. కె.విశ్వనాథ్ .. ముఖేశ్ రుషి .. జయప్రకాశ్ రెడ్డి .. మోహన్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథలతో చాలామంది హీరోలు సినిమాలు చేశారు. కానీ ఆ తరహా సినిమాలకు బాలకృష్ణ ఎక్కువగా సెట్ అయ్యారు. అదే విషయాన్ని మరోసారి నిరూపించిన చిత్రంగా ‘నరసింహనాయుడు’ కనిపిస్తుంది.
ఊరికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కథానాయకుడు చిన్నపాటి ఇల్లు ఒకటి వేసుకుని, ఓ పసివాడితో కలిసి జీవిస్తుంటాడు. చుట్టుపక్కల పిల్లలకి నాట్యాచార్యుడిగా సంప్రదాయబద్ధమైన నాట్యం నేర్పుతూ ఉంటాడు. ఆ ఊరిపై జమీందారుగా సింహాచలం (జయప్రకాశ్ రెడ్డి) పెత్తనం చేస్తుంటాడు. ఆయన బావ అయిన కుప్పుస్వామి (ముఖేశ్ రుషి)కి ఒక కూతురు ఉంటుంది .. ఆమె పేరు అంజలి (ప్రీతి జింగానియా). సరదాగా తాను సింహాచలం వాళ్ల ఊరు వెళతానని అంజలి పట్టుబట్టడంతో, కుప్పుస్వామి పంపిస్తాడు.
అక్కడ నాట్యాచార్యుడుగా ఉన్న కథానాయకుడిని చూసిన మరుక్షణమే ఆమె మనసు పారేసుకుంటుంది. నాట్యం నేర్చుకుంటానని చెప్పేసి, ఆ డాన్స్ మాస్టర్ కొడుకైన పసివాడికి దగ్గరవుతుంది. అతనికి అభ్యంతరం లేకపోతే ఆ పసివాడికి తాను తల్లిని అవుతానని అంటుంది. అయితే సింహాచలం కొడుక్కిచ్చి తన కూతురి పెళ్లి చేయాలనుకున్న కుప్పుస్వామి అందుకు నిరాకరిస్తాడు. తన కూతురు ప్రేమించింది .. తను ఇంతకాలంగా అన్వేషిస్తున్న తన శత్రువు నరసింహా నాయుడేనని తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. నరసింహనాయుడి భార్య చనిపోవడానికీ .. ఆ పసివాడు తల్లిని కోల్పోవడానికి కారకుడు తన తండ్రి అని తెలిసి అంజలి కన్నీళ్ల పర్యంతమవుతుంది. అంజలి తనని ఎంతగా ప్రేమించిందీ తెలుసుకున్న నరసింహనాయుడు, ఆ విషయంలో అడ్డుపడిన వాళ్లందరికీ దేహశుద్ధి చేసి ఆమెను తన అర్థాంగిగా చేసుకుంటాడు.
దర్శకుడు బి.గోపాల్ కి బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు. అందువలన ఆయనకి తగిన కథనే ఎంచుకున్నాడు. ఇక చిన్నికృష్ణ స్క్రీన్ ప్లే కారణంగా ఎప్పటికప్పుడు సగటు ప్రేక్షకుడు ఉత్కంఠకు లోనవుతాడు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సహజంగానే పవర్ఫుల్ గా ఉంటాయి. ఇక హీరోగా బాలకృష్ణ దొరికాడంటే వాళ్లు పండుగ చేసుకుంటారు. “ప్లేస్ నువ్వు చెప్పినా సరే .. నను చెప్పమన్నా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే .. నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే .. ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా .. కంటిచూపుతో చంపేస్తా” అనే డైలాగ్ కు అప్పట్లో థియేటర్స్ లో విజిల్స్ వర్షం కురిసింది.
Must Read ;- గూఢచారిగా బాలయ్య.. దర్శకుడెవరు?
ఇక యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికొస్తే .. ప్రతి యాక్షన్ సీన్ ను తెరపై భారీగా ఆవిష్కరించారు. ట్రైన్ లో వెళుతున్న హీరోను సుమోల్లో ఛేజ్ చేయడం, విదేశాలకు బయల్దేరిన అన్నలను తన ప్రాణాలను పణంగా పెట్టి హీరో ఊరు దాటించడం వంటి ఎపిసోడ్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయి. విక్రమ్ ధర్మా చాలా డిఫరెంట్ గా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసి, మాస్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించాడు. ఇక లారెన్స్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మణిశర్మ ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ‘నిన్నాకుట్టేసినాదీ .. మొన్నా కుట్టేసినాది’ .. ‘ కొక్కొక్కోమలి’ .. ‘లక్స్ పాప’ పాటలు కుర్రకారును ఒక ఊపు ఊపేశాయి.
వీఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్స్ ను .. విదేశాల్లోని పాటలను ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రతిపాటా కూడా కలర్ ఫుల్ గా కనివిందు చేస్తూ, మనసును ఉత్సాహంతో ఉరకలు వేయిస్తుంది. ‘నరసింహనాయుడు’ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టేశాడు. ఇక అతని మొదటి భార్య పాత్రలో సిమ్రాన్ డాన్సుల పరంగాను .. ఎమోషనల్ సీన్స్ పరంగాను చాలా బాగా చేసింది. బాలకృష్ణ సినిమా అంటే ఇలా ఉండాలనే కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలన్నీ కరెక్టుగా కుదిరిన సినిమాగా ‘నరసింహనాయుడు’ కనిపిస్తుంది. అందుకే బాలకృష్ణ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది! 20 ఏళ్లు పూర్తయినా మనం గుర్తుపెట్టుకుని మరీ మాట్లాడుకునేలా చేసింది!!
Also Read ;- బాలయ్యతో సినిమా గురించి నాగశౌర్య ఏమన్నాడో తెలుసా.?
— పెద్దింటి గోపీకృష్ణ