ఎన్టీఆర్ ను ఆంధ్రుల ఆరాధ్య దైవంగా మలిచింది కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడి మీద తీసిన సినిమానే. వాటిలో మొట్టమొదటిసారిగా వచ్చిన సినిమా‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’.ఈ సినిమా విడుదలై అరవయ్యేళ్లు దాటిపోయింది.
దర్శకుడు పి. పుల్లయ్య తన స్వీయ దర్శకత్వంలో సి.ఎస్.ఆర్., శాంతకుమారి లతో 1939లో రూపొందించిన సినిమానే మళ్లీ నిర్మాతగా మారి పద్మశ్రీ పతాకంపై ఎన్టీఆర్, సావిత్రిల, ఎస్.వరలక్ష్మిలతో శ్రీవేంకటేశ్వర మహత్యం (బాలాజీ) చిత్రాన్ని పునర్నిర్మించారు. తొలిచిత్రం మాదిరిగానే ఈ చిత్రం కూడా అంత సంచలనం సృష్టించింది. ఈ సినిమా విశేషాలను తెలుసుకుందాం. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం కథ అందరికీ తెలిసిందే. లోక కల్యాణం కోసం సప్త రుషులు చేస్తున్న యజ్ఞంలో హవిస్సును త్రిమూర్తులలో ఎవరికి సమర్ఫిస్తున్నారన్న నారదుని ప్రశ్నకు త్రిమూర్తులను పరీక్షించటానికి భృగు మహర్షి బయలు దేరతాడు. బ్రహ్మ, సరస్వతి వీణానాదంలో మైమరచి భృగువును పట్టించుకోడు.
భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగవని శపించి కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడు పార్వతితో తాండవంతో మునిగి భృగువు రాకను గమనించడు. శివునికి లింగ రూపంలోనే పూజలు జరుగు తాయని శపించి వైకుంఠానికి వెళతాడు. లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా నిదురలో ఉన్న శ్రీ మహావిష్ణువు భృగువు రాకను గమనించడు. భృగువు కోపించి శ్రీమహావిష్ణువు వక్షస్ఠలం పై కాలితో తంతాడు. శ్రీ మహా విష్ణువు లేచి భృగువును శాంతపరిచే నెపంతో అతని పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని చిదుముతాడు. భృగువుకు జ్ఞానోదయమవుతోంది. తన నివాస స్థలాన్ని కాలితో తన్ని అవమానించాడని శ్రీమహాలక్ష్మి విష్ణువుపై అలక వహించి భూలోకానికి వెళుతుంది. ఆమెను వెతుకుతూ శ్రీమహవిష్ణువు భూలోకానికి వచ్చి తపస్సులో నిమగ్నవుతాడు .
శ్రీ మహా విష్ణువు ఆకలి తీర్చడానికి శివుడు, బ్రహ్మ ఆవు దూడలుగా మారతారు. శ్రీమహాలక్ష్మి గోప కాంత యై ఆ ఆవుదూడలను మహారాజుకు అమ్ముతుంది. ఆవు మంద నుంచి వేరుపడి శ్రీ మ వద్దకు వెళతాడు. అతన్ని శ్రీనివాసునిగా పిలుస్తూ అతనిపై పుత్ర వాత్సల్యం చూపుతుంది. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి వలచి ఆ విషయాన్ని వకుళకు చెబుతాడు. వకుళ ఆకాశరాజును కలిసి వివాహానికి అతడిని అంగీకరింప చేస్తుంది. కుబేరుని ఆర్థిక సహాయంతో శ్రీనివాసుడు, పద్మావతిల వివాహం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీమహాలక్ష్మి అక్కడకు చేరుతుంది. ఇద్దరు భార్యల కలహంతో శిలగా మారతాడు శ్రీనివాసుడు. ఇలా శ్రీనివాసుడి వృత్తాంతమే ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా తెరకెక్కింది.
ఈ సినిమా హైలైట్స్
* 1939లో వచ్చిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్య్యం’లో పద్మావతి పాత్రను పోషించిన పుల్లయ్య భార్య శాంతకుమారి పోషించారు. 1960లో వచ్చిన సినిమాలో వేంకటేశ్వరుడి పెంపుడు తల్లి వకుళ పాత్రను ఆమె పోషించారు.
* 1957లో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం షూటింగ్ మొదలై 1959 చివరకు పూర్తయింది. శాంతకుమారి సోదరుడు వి. వెంకటేశ్వర్లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.
* కళా దర్శకుడు ఎస్.వి.ఎస్. రామారావు వాహినీ స్టూడియోలో వేంకటేశ్వరస్వామి దేవస్థానం సెట్ వేశారు. సినిమా షూటింగ్ పూర్తయినా ఏడాదిపాటు ఆ సెట్ అలాగే ఉంచారు. అక్కడ గుళ్లో చేసినట్టుగానే నిత్య పూజలకు ఏర్పాట్లు చేశారు.
Must Read ;- సినీ, రాజకీయ రంగాల్లో.. ఎన్టీఆర్ ఓ లెజెండ్..!
* సాంఘిక చిత్రాలకు మాటలు రాసే ఆత్రేయ దీనికి మాటలు రాశారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆరుద్ర, వేణుగోపాల్ కొన్ని పాటలు రాశారు. నారపరెడ్డి పద్యాలు రాశారు.
* నారదుడిగా రంగస్థల నటుడు సూరిబాబు నటించారు. సినిమా చివరలో వచ్చే పద్యంలో అక్కడ వేంకటేశ్వరుడు ఎందుకు వెలిశాడు, అలివేలు మంగాపురం ఏమిటి? విప్రమాత శ్రీనివసుడి మెడలో పూలదండగా ఎలా మారింది అనే ప్రశ్నలకు సమాధానాలు కనిపిస్తాయి.
* వేంకటేశ్వరుడు సోదె పాత్రధారి రూపంలో వెళ్లినపుడు ఆ అతిథి పాత్రను షావుకారు జానకి పోషించారు.
* తమిళంలోకి శ్రీనివాస కళ్యాణం, హిందీలోకి భగవాన్ బాలాజీగా ఈ చిత్రాన్ని అనువదించారు. దీనికి పి.ఎల్. రాయ్ కెమెరామన్.
* ఎన్టీఆర్ ను కలియుగ వేంకటేశ్వరుడిగా చూడటం ఈ సినిమా నుంచే మొదలైంది. తిరుపతికి వెళ్లివచ్చే భక్తులు అటునుంచి చెన్నై వెళ్లి ఎన్టీఆర్ దర్శించి వచ్చేవారు.
* ఈ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర హుండీలు పెట్టారు. సినిమా కలెక్షన్లలో దాదాపు సగం హూండీ ఆదాయమే వచ్చేది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని తిరుపతి ఆలయానికి పంపారు.
* ఇందులో భృగువుగా గుమ్మడి వెంకటేశ్వరరావుగా నటించారు. పాత చిత్రంలో మద్దూరి బుచ్చన్న శాస్త్రి అనే రంగస్థల నటుడు ఈ పాత్రను పోషించారు.
* శ్రీదేవి వేషాన్ని ఎస్. వరలక్ష్మి చేసింది. ఆమె మీద రెండు అద్బుతమైన పాటలు కూడా ఇందులో ఉన్నాయి.
* 1939లో ఈ సినిమా చేసే సమయంలోనే పుల్లయ్య, శాంతకుమారి దంపతులకు పుట్టిన కూతురికి పద్మావతి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత 1960లో వచ్చిన సినిమా విడుదల సమయంలో వీరి కూతురు పద్మావతికి వివాహం జరిగింది.
ఆత్రేయ పాటలే కాదు మాటలు కూడా
ఈ సినిమాకు ఆచార్య ఆత్రేయ మాటలతో పాటు కొన్ని పాటలను రాశారు. అంతేకాదు ఈ సినిమా చివరి సన్నివేశాలపై వేంకటేశ్వర స్వామి మహాత్యాలను చెప్పే వ్యాఖ్యాతగానూ మారారు. ఇందులోని పాటలను జనం ఎంతో ఆదరించారు. పద్మావతి, లక్ష్మీ దేవిల మధ్య కయ్యం సన్నివేశంలో శ్రీనివాసుడు శిలావిగ్రహంలా మారతాడు. ఈ సన్నివేశాన్ని పుల్లయ్య తనదైన శైలిలో చిత్రీకరించి ప్రేక్షకుల మెప్పును పొందారు. ఈ సినిమా కోసం తిరుపతిలాగా గర్భాలయం సెట్ వేసి దేవుణ్ణి ప్రతిష్ఠించారు. వాహినీ స్టూడియోలో నిర్మాత నాగిరెడ్డి ఇంటి వెనకే ఉన్న ఫ్లోర్‌లో తిరుమల గర్భగుడి సెట్ వేశారు. కే.జి.వేలుస్వామి అనే శిల్పి మూల విరాట్టుతో పాటు మిగతా విగ్రహాలను తయారు చేశారు.
కళా దర్శకుడు ఎస్.వి.ఎస్. రామారావు ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. ఈ సెట్ లో వేంకటేవ్వర స్వామి విగ్రహాన్ని నిజంగానే వేద మంత్రాల మధ్య ప్రతిష్టించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ నిత్యం ధూప దీప నైవేద్యాలు, ఇతర కైంకర్యాలను గుడిలో జరిగినట్టే చేసేవారు. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 11 లక్షలు. అప్పట్లో ఈ సినిమాకు వచ్చే కలెక్షన్ల కంటే హుండీలో వచ్చే డబ్బులు ఎక్కువట. హుండీలో వచ్చిన డబ్బులను తిరుపతికి పంపించేవారట. ఘంటసాల నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ విడుదలైన రెండు దశాబ్దాల తర్వాత ఎన్టీఆర్.. తన స్వీయ దర్శకత్వంలో ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ అంటూ రీమేక్ చేశారు.
ఇందులో జయప్రద, జయసుధ పద్మావతి, అలివేలు మంగ పాత్రల్లో నటించారు. బాలకృష్ణ నారదుడిగా నటించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కథాంశతంతో వచ్చిన అన్ని చిత్రాలూ మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు నట జీవితంలోనే ఈ సినిమా మేలి మలుపు అని చెప్పాల్పి ఉంటుంది. ఎందుకంటే పురాణ పాత్రలను ఎన్టీఆర్ మాత్రమే చేయగలరనడానికి నాంది పలికిన సినిమా ఇదే. ఆ తర్వాతే ఎన్టీఆర్ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి పురాణ పాత్రలను చేశారు. ఎన్టీఆర్ ను జనం ఆరాధ్య దైవంగా కొలవడానికి ప్రధాన కారణం ఈ చిత్రమే నని అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- వెండితెరకు వెలుగులద్దిన ధ్రువ‘తారక’ రాముడు (ఎన్టీఆర్ 25 వర్ధంతి)