ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితి తయారైంది. థియేటర్లలో కాకుండా నిర్మాతలు నేరుగా ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చేయటానికి సిద్ధమవుతుండటమే దీనికి కారణం. ఈ పరిస్థితి మీద ఇంతకుముందు కూడా ఇరువర్గాల వారూ సమావేశమై ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం అక్టోబరు నెలాఖరు వరకూ ఏ నిర్మాతా తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయకూడదనే షరతు పెట్టారు. అయినా కొందరు ఓటీటీ విడుదల విషయంలో వెనుకంజ వేయడం లేదు.
దీని మీద మరోసారి చర్చించేందుకు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు మధ్యాహ్నం సమావేశం ఏర్పాటుచేసింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరో నటించిన నారప్ప చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేశారు. దృశ్యం 2 చిత్రం విషయంలోనూ ఓటీటీకే మొగ్గుచూపారు. ఈ సినిమా మలయాళంలో రూపొందినప్పుడు ఓటీటీ ద్వారానే విడులైంది. అందుకే తెలుగు వెర్షన్ కూడా ఓటీటీ బెటర్ ఆప్షన్ అనుకున్నారు. ఈ విషయంలో ఇంకా సందేహాలు ఉన్నాయి. అలాగే నితిన్ మ్యాస్ట్రోను కూడా ఓటీటీ లోనే విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ కోవలోకే నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ వస్తుంది. ‘టక్ జగదీష్’ కు కూడా ఓటీటీ ఒప్పందం జరిగిపోయినట్టు సమాచారం. సెప్టెంబరు 10న టక్ జగదీష్ ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు నాగచైతన్య, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇంత రిస్క్ చేసి థియేటర్లను ప్రారంభిస్తే థియేటర్లలో కాకుండా ఇలా సినిమాను ఓటీటీలో విడుదల చేయటమేమిటని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క ఎగ్జిబిటర్లు, ఇంకో పక్క డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలపై ఆగ్రహంతో ఉన్నారు. వీరింతా సినిమా బిజినెస్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఓటీటీని తక్కువ అంచనా వేయవద్దని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ ఓటీటీ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అదే జరిగితే చాలా థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. టక్ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై హీరో నాని కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కానీ నిర్మాతలు ఏమీ చేయలేని పరిస్థితి. కరోనా కారణంగా సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. ఇలాంటి సినిమాలెన్నో ఉన్నాయి.
ఫైనాన్సర్ల దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు కూడా భారమయ్యాయి. మరో పక్క సినిమాలను కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రావడం లేదు. సొంతంగా విడుదల చేసి సాహసం చేయడం కన్నా ఓటీటీలో విడుదలైతే తాము సేఫ్ జోన్ లో ఉంటామన్న నమ్మకం నిర్మాతలది. దీనికి ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఇది కాలం తెచ్చిన మార్పే తప్ప మరేమీ కాదు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఈరోజు సమావేశమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Must Read ;- వెంకీ దృశ్యం 2 విడుదల థియేటర్లలోనేనా?











