కరోనా న్యూ స్ట్రెయిన్ దెబ్బకు విలవిల్లాడుతున్న బ్రిటన్ లో మరణాల సంఖ్య లక్ష దాటింది. యూరప్ లో కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ లోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. ప్రపంచంలో లక్షకు పైగా మరణాలు సంభవించిన ఐదో దేశంగా బ్రిటన్ నిలిచింది. ఇప్పటివరకు ఇక్కడ 36.70 లక్షల కేసులు నమోదుకాగా.. మరణాల రేటు 2.72గా ఉంది. దాదాపు రెండు నెలల నుంచి ఇక్కడ కొత్త స్ట్రెయిన్ ప్రభావం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మంగళవారంతో 10 కోట్లు దాటాయి. ఇందులో ఒక్క అమెరికాలోనే పావు వంతు కేసులు నమోదుకావడం గమనార్హం. అక్కడ ఇప్పటివరకు మొత్తం 2.60 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. అక్కడ ఇప్పటికీ రోజుకి లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నా.. కేసులు, మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, భారత్ లో తాజాగా 12,689 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527కి చేరింది. గడచిన 24 గంటల్లో మరో 137 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,53,724కి పెరిగింది. అలాగే, దేశంలో రికవరీల జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,03,59,305 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 96.91 శాతంగా ఉంది. ప్రస్తుతం కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 1,76,498 మంది మాత్రమే కావడం గమనార్హం.
Must Read ;- కరోనాను కట్టడి చేస్తోన్న నారీ శక్తి!