వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కారు మొద్దు నిద్ర కారణంగా జైలు శిక్షకు గురవుతున్న ఐఏఎస్ ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటికి మొన్న ఇద్దరు కీలక అధికారులు గిరిజాశంకర్ , చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యవహారంలోనే గురువారం ఏకంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు వారికి జరిమానాను కూడా విధించింది. ఈ ఐదుగురు ఐఏఎస్ లలో ఓ అధికారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక స్థానంలో పనిచేస్తున్న వారు కావడం గమనార్హం. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానా విధించిన కోర్టు.. వారి ఏడుపు ముఖాలు చూసి కాస్త కనికరించినట్టుగానే కనిపించింది. ఈ శిక్షలపై అప్పీల్ చేసుకునేందుకు వారికి ఓ నెల రోజుల పాటు సమయం ఇచ్చింది. దీంతో బతుకు జీవుడా అంటూ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
కేసు ఏమిటంటే..?
నెల్లూరు జిల్లా తాళ్లపాక గ్రామంలో ప్రభుత్వ అవసరాల కోసం సాయిబ్రహ్మ అనే మహిళకు చెందిన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పరిహారం మాత్రం చెల్లించలేదు. పరిహారం కోసం ఆమె అధికారుల చుట్టూ చాలా సార్లు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ పరంగా తాను పెట్టుకోవాల్సిన అర్జీలన్నీ పెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం మిగతా అన్ని తీర్పుల్లాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు. పరిహారం చెల్లించలేదు. దీంతో మళ్లీ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు నిర్లక్ష్యం వహించడంతో పాటు కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్దారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
ఎవరెవరికి?.. ఎంతెంత..?
ఇప్పటికే సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందిన రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రూ.1000 జరిమానా, 2 వారాల జైలు , ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఎస్.ఎస్.రావత్‌కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, నెల్లూరు మాజీ కలెక్టర్ రేవు ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానా విధించింది. ప్రస్తుతం ముత్యాలరాజు సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌కు కూడా నెల రోజుల జైలు రూ. 1000 జరిమానా హైకోర్టు విధించింది. వీరందరికీ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. జరిమానాను ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కత్తిరించి ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం మరింత సంచలన తీర్పు వెలువరించింది.
Must Read ;- వీళ్లందరినీ కాదని ఆమెకిస్తారేమో!