ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... పార్టీ పరంగా అంతగా దూకుడు ప్రదర్శించడం లేదు గానీ… పాలనలో… అది కూడా తనకు ఇష్టమైన వ్యవహారాల్లో మాత్రం ఓ రేంజి దూకుడుతో సాగుతున్నారు. ఈ దూకుడు ఏం రేంజిలో ఉందంటే… ఆ దూకుడుకు జైకొడుతూ నిబంధనలకు నీళ్లొదిలి పాలనా నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులను జైలుకు పంపేదాకా. నిజమా? అంటే… స్వయంగా కోర్టులే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటే… అబద్ధమని చెప్పేదెలా? ఆ కథాకమామీష/ ఏమిటో చూద్దాం పదండి.
పోతిరెడ్డిపాడుపై జగన్ దూకుడు
ఏపీ సీఎం కుర్చీ ఎక్కగానే.. జగన్ తొలుత తన సొంత ప్రాంతం రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సొంత ప్రాంతం మీద కాస్తంత మమకారం ఎక్కువ ఉండటం సాధారణమే గానీ.. మరీ జగన్ చూపిస్తున్నంత దూడుకు కుదరదు కదా. అదీ.. ఇదేమీ జగన్ సొంత యవ్యారం కాదాయే. తాను చేపట్టే పనులు అంతరాష్ట్ర వివాదాలకు తెర తీస్తాయనీ తెలుసు. అయితేనేం… వేరేవాళ్లు చెప్పే విషయాన్ని అంతగా పట్టించుకోని జగన్… పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే కదా. అసలు పోతిరెడ్డిపాడునే వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాసులు… ఇక పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సర్కారు పలు అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం, కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఈఆర్ఎంబీ)లకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు కోర్టులను ఆశ్రయించారు.
ఎన్జీటీని ఆశ్రయించిన తెలంగాణ వాసి
ఈ ఫిర్యాదుల్లో తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యూనల్ (ఎన్జీటీ)లో వేసిన పిటిషన్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే ఎన్జీటీ విచారణ చేపట్టి.. రాయలసీమ పథకంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని జగన్ సర్కారు… రాయలసీమ పథకం పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస మరో మారు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ… తమ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ను హెచ్చరించింది. ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేఈఆర్ఎంబీ, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చేనెల 12కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మొన్న హైకోర్టు… నేడు ఎన్జీటీ
ఇప్పటికే జగన్ చెప్పినట్లు నడుచుకున్న చాలా మంది ఐఏఎస్ అధికారులు జైలు ఊచలు లెక్కపెట్టారు. మొన్నటికి మొన్న జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ లకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లుగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువక ముందే… ఏకంగా రాష్ట్ర పాలనకే బాస్ గా నిలుస్తున్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను జైలుకు పంపుతామంటూ ఎన్జీటీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తంగా ఐఏఎస్ అధికారుల భవితవ్యం జగన్ చేతుల్లో ఇరుక్కుపోయిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- జగనొచ్చాడు.. ఐఏఎస్‌లు జైలుకెళుతున్నారు











