రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమను అప్పనంగా అయినవారికి కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రులు ఆత్మగౌరవంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటు చేతిలో పెట్టాలనే నిర్ణయం అనాలోచితమైనది ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి లేఖ రాయడాన్ని ఆయన స్వాగతించారు. స్టీల్ ప్లాంటు వల్ల వేలాది మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాది పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.
నాలుగు దశాబ్దాల కిందటే 20 వేల ఎకరాలు సేకరణ
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం నాలుగు దశాబ్దాల కిందటే 20 వేల ఎకరాలు సేకరించారని ఆ భూముల విలువ ఇప్పుడు లక్ష కోట్లకు పైగా ఉందని రామకృష్ణ వెల్లడించారు. విలువైన భూములు ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకే శాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తెరమీదకు తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ హీరో చిరంజీవి కూడా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారని, ఇలాంటి సమయంలో అందరూ కలసి రావాలని ఆయన విజ్ఙప్తి చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన సీఎంకు లేఖ రాశారు.
Must Read :విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ రావాలి..