వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడు. ఇందులో ఏ ఒక్కరికీ అనుమానం లేదు. జగన్ అనుసరించే పద్దతులు, తన ఊరు పులివెందులలో ఆయన వ్యవహరించే తీరు, క్రిస్మస్ నాడు ఆయన చేసే ప్రార్థనలు, తన తండ్రి జయంతి, వర్థంతిల సందర్భంగా ఇడుపులపాయలో జగన్ నివాళి.. ఇలా ఏ కార్యక్రమం చూసినా కూడా జగన్ క్రైస్తవుడిగానే మసలుకుంటారు. ఇందులో ఏ ఒక్కరికీ అభ్యంతరం కూడా లేదు. అయితే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునే సమయంలో అన్య మతస్తులు పాటించాల్సిన విధి విధానాలను జగన్ పాటించకపోవడమే హిందువులను ఒకింత ఆగ్రహానికి గురి చేస్తోంది. క్రైస్తవుడిగా ఉన్న జగన్ తిరుమల వెంకన్నను దర్శించుకోరాదని కూడా ఏ ఒక్కరూ ఆంక్షలు విధించడం లేదు. అయితే క్రైస్తవుడిగా ఉన్న జగన్.. ఆలయంలో అన్య మతస్తుల కోసం ఏర్పాటు చేసిన డిక్లరేషన్‌లో సంతకం చేయాలి కదా. అలా సంతకం చేయకుండా జగన్ తిరుమల వెంకన్నను దర్శించుకోవడమే హిందువులను ఆయన అగౌరవపరచినట్టుగా చెప్పుకోవాలి. ఈ వ్యవహారంపై ఎన్ని సార్లు విమర్శలు వచ్చినా.. జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ అస్సలు పట్టించుకున్న పాపానే పోవడం లేదు.
తాజాగా మరో వివాదం..
తాజాగా తిరుమల కొండపై వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం హోదాలో జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున ఏటా కొనసాగుతున్న ఆచారం కాబట్టి.. జగన్ కూడా మంగళవారం నాడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళ్లారు. సోమవారమే తిరుమల వెళ్లిన జగన్.. అక్కడ కొన్ని ఇతరత్రా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అనంతరం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాక.. స్వామి వారికి తులాభారం మొక్కు కూడా చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పిన్నమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఏడు కొండల పరిధిలో శ్రీవారి నామస్మరణే మారుమోగుతుండగా.. జగన్ తులాభారం సందర్భంగా తన సోదరి కుమారుడు జగన్ ను తులాభారంపై మరింత సేపు కూర్చునేలా ఆయనను పట్టుకుని.. ‘‘జగన్ రెడ్డి రక్షక గోవిందా’’ అంటూ కొత్త నామస్మరణను వినిపించారు. స్వర్ణలత నోట నుంచి మాట వినిపించినంతనే.. అక్కడ ఉన్నవారంతా అదే పదాన్ని ఉచ్ఛరించగా.. ఆలయ మర్యాదలు తెలిసిన ఎవరో వారించారు. ఈ మొత్తం వ్యవహారం ఓ వీడియో రూపంలో విడుదల కాగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా జగన్, ఆయన పిన్నమ్మ స్వర్ణలతపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
తూర్పారబట్టిన నారా లోకేశ్
ఈ వివాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు స్వామివారిపై ఎందుకీ దొంగ భక్తి అంటూ సెటైర్లు సంధించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా ఈ వివాదంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లను సంధించారు. ఆ ట్వీట్లలో ‘‘మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఏడుకొండలవాడి సేవచేసే అవకాశం దొరికితే…ఆ స్వామికే అపచారం తలపెట్టే పనులు మంచిది కాదు టీటీడీ చైర్మన్ @yvsubbareddymp గారూ! ఓ బాబాయ్‌కి గొడ్డలిపోటు కానుకగా ఇచ్చి, బాబాయ్ కోటాలో మిమ్మల్ని ఈ స్కీంకి ఎంపిక చేయని అబ్బాయి @ysjagan మీ పాలిట దేవుడే కావొచ్చు. ఆయన ఫోటో మీ ఇళ్లల్లో పెట్టి పూజించుకోండి.. దేవుడిగా కొలుచుకోండి..వీలైతే పాదపూజ చేసుకోండి. కొండపై గోవిందనామాల బదులు జగన్ నామస్మరణ మహాపరాధం. స్వామిఅమ్మవార్లకు పదేపదే అపచారాలు తలపెడుతూ మళ్లీ..జగన్‌రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టిటిడి చైర్మన్ సతీమణి అపచారపు నామస్మరణ స్వామివారికి తీరని కళంకం. భక్తి వుంటే భార్య ఎందుకు రాదు? వేదపండితులు తలపై వేసిన అక్షతల్ని అసహ్యంగా దులుపుకోవడం, ప్రసాదం వాసన చూడటం.. స్వామిపై ఎందుకీ దొంగ దైవభక్తి జగన్‌రెడ్డి గారూ?’’ అంటూ లోకేశ్ విరుచుకుపడ్డారు.
Must Read ;- ఆ ఇద్దరి ప్రైవేట్ జెట్లలో జగన్ విలాసం