Daily Waze Labourer Son Vishwanath Selected For World Sailing Contest :
పై ఫోటోలో కనిపించే కుర్రాడిది సాధారణ కుటుంబం. తల్లిదండ్రులు దినసరి కూలీలు. సెయిలింగ్ పై ఇష్టం పెంచుకున్నాడు. పేదరికం వెంటాడినా తనకిష్టమైన హాబీని విడిచిపెట్టలేదు. ఆర్థిక సమస్యలను అధిగమించి సెయిలింగ్ సత్తా చాటాడు. తన అద్భుత ప్రదర్శనతో వరల్డ్ సెయిలింగ్ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు.
కూలీ కుటుంబం
పడిదల విశ్వనాథ్ ది నల్లగొండ జిల్లా సూర్యాపేట. తల్లిదండ్రులిద్దరూ సాధారణ కూలీలు. కూలీ పని దొరికితేనే పూట గడుస్తుంది. లేదంటే పస్తులే. సంపాదించిన సగం డబ్బులను కొడుకు విశ్వనాథ్ చదువుకే ఖర్చుపెట్టేవారు. నిత్యం కూలీ పనులు చేస్తూ.. పిల్లాడ్ని చదివించేవారు. అయితే ఉన్న ఊళ్లో పని దొరక్కపోవడంతో.. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ కు వచ్చారు. ఒకవైపు కూలీ పనులు చేస్తూనే.. మరోవైపు పిల్లాడ్ని చదివించడం మొదలు పెట్టారు. గురుకుల విద్యాలయాల్లో నిరుపేద పిల్లలు బాగా చదువుతున్నారని తెలుసుకొని… ఆ దిశగా ఎంకరేజ్ చేశారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ గురుకులలో సీటు సాధించాడు. అదే విశ్వనాథ్ జీవితాన్ని మార్చేసింది.
అలలపై పోటీ పడుతూ..
గురుకులంలో చదువుతో పాటు ఇతర విషయాలను నేర్పిస్తుండటంతో.. విశ్వనాథ్ సెయిలింగ్ ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో సెయిలింగ్ శిక్షణ తీసుకున్నాడు. ఎన్నోసార్లు గాయాలపాలయ్యాడు. అయినా కూడా సెయిలింగ్ ను విడిచిపెట్టలేదు. 12 ఏళ్ల వయసులోనే నేవీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ(ఎన్‌బీఎస్‌సీ)కి ఎంపికయ్యాడు. నేవీ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎన్‌బీఎస్‌సీలో సెయిలింగ్‌లో మరింత రాటుదేలాడు. 2017 సబ్ జూనియర్ అంతర్జాతీయ పోటీల్లో రజత పతకంతో సాధించాడు. త్వరలో ఇటలీలో జరగబోయే ప్రపంచ ఆప్టిమిస్టిక్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ నుంచి సెలెక్ట్ అయ్యాడు. ఒలింపిక్స్, ఆసియా లాంటి టోర్నీల్లో రాణించడమే తన లక్ష్యమని అంటున్నాడు విశ్వనాథ్.
Must Read ;- మిథాలీ ఘనత : ఇండియా రికార్డును బీట్ చేయడం కష్టమే!










