నిబంధనల మేరకు నీటి నిల్వలు లేకున్నా కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ, తెలంగాణల మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాయి. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తోంది. దీనిపై ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని సూచించారు. జలాశయంలో సరిపడా నీరు లేకుండా విద్యత్తు ఉత్పత్తి చేయటం నీటి నిబంధనలు ఉల్లంఘించటమేనని అధికారులు అంటున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్ద ఇటు వైపు తెలంగాణ, అటు వైపు ఆంధ్రా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. జూరాల వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.
నాగార్జునసాగర్ వద్ద..
ప్రస్తుతం సాగర్‌లో 176.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతూ 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో సాగర్ డ్యాం, విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్‌హౌస్‌లోకి అనుమతించడం లేదు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 100 మంది ఎస్‌పీఎఫ్, గ్రేహౌండ్స్, రిజర్వు బలగాలు ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నారు.
పులిచింతలలో..
విధివిధానాలకు భిన్నంగా తెలంగాణ అధికారులు జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డుకు బుధవారం ఫిర్యాదు చేశారు. కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, బోర్డుకు వర్తమానం ఇవ్వకుండానే పులిచింతల నుంచి నీటిని తీసుకుంటున్నారన్నారు. దీన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కృష్ణా బోర్డు కార్యదర్శిని లేఖలో కోరారు. అయినా విద్యదు ఉత్పత్తిని ఆపక పోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు వైపు సూర్యాపేట జిల్లా పరిధిలో తెలంగాణ పోలీసులు, అటు వైపు గుంటూరు జిల్లా పరిధిలో పోలీసులు పహారా కాస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో వంద మందికి పైగా పోలీసులు ప్రాజెక్టు ప్రాంతంలో కాపలా కాస్తున్నారు.
Must Read ;- బాబు మార్కు పాలన వీరి వల్ల కాదంతే!











