ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా చెప్పిన మాటలు.. ఇవాళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కనీసం మూడు సంవత్సరాల వ్యవధి ఉండగానే.. ప్రధాన ఎన్నికల కమిషనర్.. జమిలి ఎన్నికలకు తాము సిద్ధం అని చెప్పడం.. అందరి దృష్టిని ఆ దిశగా మళ్లించింది. అయితే.. ఈ విషయాన్ని పవన్ నవంబరులోనే చెప్పారు. 2024 వరకూ ఎన్నికల కోసం ఆగవలసిన అవసరం లేదని పవన్ కల్యాణ్.. నవంబరులో మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ సమీక్ష సమావేశాల సందర్భంగా చెప్పారు.
జమిలి ఎన్నికల గురించి వేర్వేరు సందర్భాల్లో ఇతర నాయకులు కూడా ప్రస్తావించినప్పటికీ.. పవన్ కల్యాణ్ కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామి పార్టీకి నాయకుడు కావడం, కేంద్రంలోని పెద్దలతో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి కావడం, అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నేతలెవ్వరూ ఈ ఊసు ఎత్తకపోవడం కారణాన ఆయన మాటలకు ప్రయారిటీ పెరిగింది. తాజా పరిస్థితుల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా కూడా జమిలి ఎన్నికలకు తాము సిద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ చెప్పిన జోస్యం ఇవాళ నిజమవుతోంది. ఢిల్లీ టవర్ నుంచి పవన్ కల్యాణ్ కు అందుతున్న సిగ్నల్స్ చాలా స్ట్రాంగ్ అని అంతా చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో జమిలి ఎన్నికల గురించిన చర్చ ఇప్పుడు బాగా ఊపందుకుంది. విపక్ష పార్టీలు కేవలం మరో రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయనే నమ్మకంతో సన్నద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో జమిలి ఎన్నికలు అనే మాటను ఏమాత్రం ఇష్టపడే అవకాశం కూడా లేదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్.. విముఖతను ప్రదర్శిస్తోంది. జమిలి అనే మాట అచ్చంగా విపక్షాల కల మాత్రమేనని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఒక రకంగా చూసినప్పుడు.. జమిలి ఎన్నికలు అనేవి 2024 కంటె కాస్తంత వెనక్కు వెళతాయని కూడా ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అంతే తప్ప ముందుకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. సూటింగా బయటకు అనలేకపోతున్నారు గానీ.. జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లకు మించి.. సీఎం పదవిలో ఉంటారనే ఆశ కూడా వారి మాటల్లో కనిపిస్తోంది.
ఆశల సంగతి పట్టించుకోవాల్సిన అగత్యం లేదు గానీ.. మొత్తానికి ఇటు అధికార, అటు విపక్ష పార్టీలు అన్నీ కూడా జమిలి ఎన్నికల గురించి బహుధా మాట్లాడుకుంటున్నాయి. తమాషా ఏంటంటే.. ఈ చర్చోపచర్చలకు పవన్ కల్యాణ్ బీజం వేశారు.
ఢిల్లీ కేంద్రంగా నడిచే రాజకీయ పరిణామాల విషయంలో ఇప్పుడు పవన్ మాటకు విలువ పెరుగుతుందా? అనే చర్చ కూడా రాజకీయాల్లో నడుస్తోంది.
Must Read ;- జనసేనానికి ఢిల్లీ సిగ్నల్స్ నిజమేనా? బిల్డప్పా?