టాలీవుడ్ అగ్రదర్శకులంతా తమ తాజా ప్రాజెక్టులతో తీరికలేకుండా ఉన్నారు. వచ్చే ఏడాది తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. అందువలన ఇక సాధ్యమైనంత త్వరగా తమ ప్రాజెక్టులను పరుగులు పెట్టించడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. కరోనా భయాన్ని పక్కన పెట్టేసి తగిన జాగ్రత్తలను తీసుకుంటూ నటీనటులంతా రంగంలోకి దిగుతున్నారు. రాజమౌళి .. పూరి .. కొరటాల .. సుకుమార్ .. అనిల్ రావిపూడి ఒక భారీ విజయం తరువాత తమ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇక ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ కూడా సిద్ధమవుతున్నాడు.
స్టార్ హీరోలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులన్నిటిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందువలన ఎప్పటికప్పుడు ఆ విశేషాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని చూపుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాలు సంచలనాలకు తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే స్టార్ డైరెక్టర్ల జాబితాలోనే ఉన్నప్పటికీ, హిట్ కి దూరంగా ఉన్న దర్శకులు కూడా వచ్చే ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ జాబితాలో ముందు వరుసలో బోయపాటి కనిపిస్తున్నాడు.
బాలకృష్ణ కథానాయకుడిగా గతంలో ‘సింహా’ .. ‘లెజెండ్‘ వంటి భారీ విజయాలను అందించిన బోయపాటి, తమ కాంబినేషన్లో మూడో సినిమాను రూపొందిస్తున్నాడు. యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట వేస్తూ తన మార్కు సినిమానే చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘సరైనోడు’ తరువాత సరైన హిట్ చూడని బోయపాటి, తాజా చిత్రంపైనే నమ్మకం పెట్టుకున్నాడు. కొత్త సంవత్సరంలో బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొడతాననే ఆశాభావంతో ఉన్నాడు.
ఎన్టీ రామారావు బయోపిక్ తో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన క్రిష్, అప్పటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీపై కసరత్తు చేస్తూనే వస్తున్నాడు. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఈ కథను రూపొందించడానికి తగిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి టైటిల్ గా ‘విరూపాక్ష’ అనే పేరు వినిపిస్తోంది. ఇక వరుస పరాజయాలతో దర్శకత్వానికి దూరంగా ఉన్న శ్రీనువైట్ల .. కాస్త గ్యాప్ ఇచ్చిన తేజ .. వీవీ వినాయక్ కూడా కొత్త ఏడాదిలో రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. కొత్త ఏడాది వీళ్లకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందేమో చూడాలి.
Must Read ;- అందరిచూపూ.. పవన్ కళ్యాణ్ విరూపాక్ష వైపే!