ప్రజారోగ్యం కాపాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేసిన తరవాత ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారని అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఉండటంతో కోర్టులు జోక్యం చేసుకునే వీల్లేదు. దీనిపై ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అత్యవసరంగా అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని పలువురు మంత్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రూ.6000 కోట్లు అమ్మఒడి నగదు జమ చేశాం. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వెళితే 90 శాతం స్థానిక సంస్థలను కైవసం చేసుకోలేమా అని సీఎం మంత్రులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే, మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలకు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. ఆ వెంటనే సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
స్థానిక ఎన్నికలకు తొలగిన అడ్డంకులు
స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంగులు తొలగిపోయాయి. గతంలో ఎన్నికల షెడ్యూల్‌ను నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టి వేసింది. ప్రజారోగ్యం ముఖ్యమే, అలాగే స్థానిక ఎన్నికలు కూడా ముఖ్యమేనని హైకోర్టు అభిప్రాయపడింది. సమన్వయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.
సుప్రీంకోర్టులో సవాల్..
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ సలహాదారు ప్రకటించినట్టుగానే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమిషనర్ గా ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేనట్టే తెలుస్తోంది. సుప్రీంను ఆశ్రయించినా అనుకూల తీర్పు వచ్చే అవకాశాలు లేవని బీజేపీ నేత సీఎం రమేష్ పలు కేసులను ఉటంకించారు. దేశంలో నాలుగు రాష్ట్రాలు ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయని, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక జోక్యం చేసుకోలేమని సుప్రీం తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు వస్తుందని రమేష్ అభిప్రాయపడ్డారు. అయినా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా అనుకూల తీర్పు రాకపోయినా స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసే అవకాశం ఉంది.
Must Read ;- స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?
స్థానిక ఎన్నికలకు ప్రతిపక్షం రెఢీ
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రకటించింది. బీజేపీ నేతలు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని 2.5 లక్షల మంది ఉద్యోగులకు ఎన్నికల కమిషనర్ పీపీఈ కిట్లు ఇస్తారా? ఉద్యోగులు కరోనాతో చనిపోతే బాధ్యత వహిస్తారా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉగ్యోగ సంఘాల నేతలు త్వరలో గవర్నర్ ను కలసి స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హుటాహుటిన విజయవాడ చేరుకున్న ఎన్నికల కమిషనర్
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చే సమయానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వారకా తిరుమలలో స్వామి వారి దర్శనంలో ఉన్నారు. దర్శనం కాగానే వెంటనే విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి చేరుకుని పని ప్రారంభించారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇంతకీ స్థానిక ఎన్నికలు జరుగుతాయా?
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో ప్రభుత్వం సహకరించకుంటే ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరగడం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.
Also Read ;- ప్రభుత్వం సహకరించకుండా స్థానిక ఎన్నికలు సాధ్యమా?