ఏపీ స్థానిక ఎన్నికల పోరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్న విధంగా తయారైంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా ఎన్నికలు పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు. నిమ్మగడ్డ పదవీ విరమణ చేసే వరకూ స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని సీఎం గట్టి అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా బూచి చూపించి ఎన్నికలు వాయిదా వేయాలని ఇవాళ మరోసారి హైకోర్టులో హౌస్ మోషన్ కు ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అనేకసార్లు హైకోర్టులో స్థానిక ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషనర్ తో చర్చించుకుని అప్పటికీ తేలకపోతే మరలా కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశించింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు శుక్రవారం ఎన్నికల కమిషనర్ కు కలసి ప్రస్థుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని తేల్చి చెప్పారు. అంతటితో చర్చలు ముగిశాయి. ఆ తరవాత జరిగిన పరిణామాల మధ్య రాత్రి 9 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషర్ షెడ్యూల్ విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రభుత్వం సహకరించకుండా ఎన్నికలు సాధ్యమా?
స్థానిక ఎన్నికలు కానీ, జనరల్ ఎలక్షన్స్ గానీ ఏవైనా ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యం కాదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు వేలాది మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ప్రభుత్వ సహకారం తీసుకుని సకాలంలో ఎన్నికలు పూర్తి చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. కానీ ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వం మధ్య 10 నెలలుగా వార్ నడుస్తోంది. కరోనా కారణంగా మార్చిలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ కాలంలో నిమ్మగడ్డ ను తొలగించి ప్రభుత్వం కనగరాజ్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దీనిపై కోర్టును ఆశ్రయించి నిమ్మగడ్డ మరలా పదవిలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు వార్ నడుస్తోందని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నిమ్మగడ్డ పదవీ కాలం మార్చి నెల చివరి వరకూ ఉంది. పదవీ కాలం ఉండగానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు.
నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలకు సహకరించకూడదని ప్రభుత్వం గట్టి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్దంగా ఉన్నారనే సమాచారం వస్తోంది. కరోనా బూచి చూపి ఎలాగైనా నిమ్మగడ్డ ఇంటికి వెళ్లే వరకు ఎన్నికలు నిలిపివేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని తేల్చిన సీఎస్
ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ
దేశంలో రాజ్యాంగబద్ద సంస్థలు అనేకం ఉన్నాయి. కానీ అవన్నీ స్వతంత్రంగా వ్యవహరిస్తాయనుకుంటే భ్రమే. ఉదాహరణకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్నే తీసుకుంటే, ప్రభుత్వం సహకరించకుండా వేలాది మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహించే శక్తి లేదు. ఎన్నికల నిర్వహణకు వెళ్లే ముందే ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన ఆర్థిక వనరులు, సిబ్బందిని తీసుకుని ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఏపీలో నిమ్మగడ్డకు ప్రభుత్వ పెద్దలకు వ్యవహారం చెడటంతో ఎవరికి వారే పైచేయి సాధించాలని చూస్తున్నారు. దీని వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. చివరకు ప్రభుత్వం నెగ్గిందా, నిమ్మగడ్డ నెగ్గారా అనే విధంగా వ్యవహారం తయారైంది. వారిద్దరి మధ్య పోరు టీవీలు చూసే ప్రజలకు వినోదం పంచుతోంది తప్ప మరొకటి కాదు. ఎన్నికలు ఎవరు నిర్వహించినా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా పూర్తి చేయగలిగితే ప్రజలకు అదే మేలు చేస్తుంది. అంతేగాని పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి, కిడ్నాప్పులు చేసి ఏకగ్రీవాలు చేసుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అవుతుంది. నిమ్మగడ్డ ఉంటే ప్రభుత్వం ఆటలు సాగవు కాబట్టి, ఆయన పదవీ విరమణ చేసే వరకు ఏదొక విధంగా కాలయాపన చేయాలని ఇందుకు కోర్టులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్ద భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏకగ్రీవాల కోసమే ఎత్తుగడ
గత ఏడాది మార్చిలోనూ స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో పెద్ద యుద్దమే జరిగింది. చాలా గ్రామాల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదు. పోలీసులు అధికార పార్టీ నేతలకు గులాంగిరీ చేశారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. మరలా కొత్తగా అనుకూలమైన ఎన్నికల కమిషనర్‌ను నియమించుకుని అధికార వైసీపీ నేతలు అదే తంతుకు తెరలేపే అవకాశం లేకపోలేదు. సగానికిపైగా గ్రామాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకోవాలని వైసీపీ అధినేత బావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సమయంలో ఫెయిర్ గా ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీకి పెద్ద దెబ్బే తగిలేలా ఉంది. అందుకే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేయడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా స్థానిక సంస్థలను కైవశం చేసుకోవాలనే ఆలోచనలో భాగంగానే నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అధినేత భయపడుతున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఏద ఏమైనా రెండు వ్యవస్థల మధ్య పోరు జనానికి అవస్థలు మిగిల్చిందని చెప్పవచ్చు.
Also Read ;- విజయసాయిరెడ్డి సిగ్నల్స్.. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు