నందమూరి నటసింహం బాలకృష్ణ.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఆహాలో ఓటీటీలో అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తుండడం తెలిసిందే. ఈ టాక్ షో ప్రొమో నుంచి షో వరకు ప్రతిదీ ఓ సంచలనమే. దీంతో ఈ టాక్ షో కు అనూహ్యమైన స్పందన లభించింది. అయితే.. ఈ టాక్ షో జరుగుతున్నప్పటి నుంచి గీతా ఆర్ట్స్ సంస్థలో బాలయ్య సినిమా చేయనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో అసలు ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల అల్లు అరవింద్ మరియు బాలకృష్ణ టాక్ షో చేస్తున్న సమయంలో సినిమా గురించి మాట్లాడుకున్నారని సమాచారం.
అయితే.. బాలయ్య ఈ అన్ స్టాపబుల్ షో చేయడం వెనుక దర్శకుడు క్రిష్ ఉన్నాడని తెలిసింది. బాలయ్య, క్రిష్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు అల్లు అరవింద్ నిర్మించబోతున్న బాలకృష్ణ సినిమాకు కూడా క్రిష్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లను చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్యకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందించింది.
దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం.. అన్ స్టాపబుల్ టాక్ షో బాలయ్య చేసేలా చేయడంలో క్రిష్ కీలక పాత్ర పోషించడంతో.. బాలయ్యతో సినిమాకి క్రిష్ అయితేనే కరెక్ట్ అని అల్లు అరవింద్ ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- బాలయ్యకు ఆపరేషన్.. ఇంతకీ ఏమైంది?