(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం జరిగిన తరువాత పరిణామాలను దేవాదాయ, పోలీసు శాఖ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది తీవ్ర చర్చానీయాంశమవడమే కాకుండా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మీడియాకు నో ఎంట్రీ ..
రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో సోమవారం వేద పండితులతో ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించి, సీతారామలక్ష్మణ విగ్రహాలను తొలగించి రహస్య ప్రదేశంలో భద్రపరిచే కార్యక్రమానికి మీడియాకు ముందస్తు సమాచారం లేదు సరేకదా .. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మీడియాను సంఘటనా స్థలానికి అనుమతించలేదు. స్వామివారి విగ్రహ శిరస్సు ధ్వంసం ఘటన నాటి నుంచి కొండపైన జరిగే విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచడంలో అంతర్యం ఏమిటని స్థానికుల నుంచి అనుమానం వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చి వెళ్లిన తరువాత బోడికొండ వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం కొండపై ప్రాయశ్చిత హోమాలను రహస్యంగానే నిర్వహించారు. కోదండరాముడి ఆలయంలో తొలగించిన విగ్రహాలను ఎవరికీ తెలియకుండానే ఎక్కడో రహస్య ప్రదేశంలో దేవస్థానం, పోలీసు అధికారులు భద్రపరిచారు. వాటిని కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడంతో నీలాచలంపై ఏమి జరుగుతోందోనని స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.
పంచలోహ బంగారు తాపడాలు ..
కోదండరాముడి ఆలయంలో విగ్రహాలను తొలగించినప్పుడు వాటి దిగువ పంచలోహ బంగారు తాపడాలు బయట పడినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి అత్యంత పురాతన ఆలయమైనందున ఈ ఆలయం గర్భగుడిలోనూ .. శిఖరంపైన విలువైన వజ్రవైడూర్యాలు ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు విగ్రహం ధ్వంసానికి పాల్పడ్డారా .. ?, ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి వుంది. సంఘటన జరిగి ఇరవై రోజులు అవుతున్నా .. స్థానిక పోలీసులు, సీఐడీ, సిట్ బృందాలు సునిశితంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ .. నిందితులను గుర్తించలేకపోవడం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.
Must Read ;- రామతీర్థంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనులకు శ్రీకారం











