విజయనగరం జిల్లా రామతీర్థం కోదండరామాలయంలోని రాములవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన మొదట్లో పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం, ప్రతిపక్షాలు, స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఘటపై సీఐడీ అధికారులు త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
వ్యతిరేకతే కారణం
ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణాది అయోధ్యగా పిలువబడే రామతీర్థం కోదండరామాలయంలోని రాముని శిరస్సును గుర్తు తెలియని దుండగులు ఖండించి కోనేరులో పడేయడంపై ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున కవరేజీ ఇచ్చింది. దీంతో ఢిల్లీ బీజేపీలోనూ కదలిక వచ్చింది. ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాలే దేవాలయాలపై దాడులు చేయించి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయని సీఎం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, చివరకు రామతీర్థం ఘటనను ప్రతిపక్ష టీడీపీకి చెందిన స్థానిక కార్యకర్తలపై నెట్టాలా ఉన్నారని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BREAK : ఎవ్వరినైనా సరే.. రామతీర్థం వెళ్లనివ్వరంతే!