తమకు అవకాశమిస్తే.. పురుషులకు ఏమాత్రం తీసిపోమని చాటుకుంటూ.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళలు.. తాజాగా జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్)లోకి ప్రవేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి అనుమతించిన మొదటి దళం వీరిదే కావడం ఇక్కడి విశేషం. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 100 మందితో కూడిన మొదటి మహిళా బృందాన్ని అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్‌లో చేర్చారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని నైపుణ్యాలూ ఈ మహిళా బృందానికి ఉన్నాయని, వారిని పూర్తి రక్షకులుగా తీర్చిదిద్దామని ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్. ప్రధాన్ తెలిపారు.
తాజాగా శిక్షణ పొందిన ఆ బృందాన్ని.. ఉత్తర ప్రదేశ్ లోని గఢ్ ముక్తేశ్వర్ పట్టణంలోని గంగా నది ఒడ్డున విధి నిర్వహణకు తరలించారు. అక్కడి పడవలకు, ఇతర సాధన సంపత్తికి సహాయకులగా విధులు నిర్వహిస్తారని అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఆడవారిని రక్షించడం, పరిరక్షించడం, సహాయం చేయడం వంటి వాటిలో వీరికి ప్రత్యేక మెలుకువలు నేర్పినట్లు అధికారులు చెప్పారు. అంతేకాదు.. గంగా నది ఒడ్డున ఏవైనా విపత్తులు ఏర్పడితే.. వెంటనే వీరు స్పందిస్తారని కూడా తెలియపరిచారు. విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించడం, ఆ తర్వాతి సహాయ చర్యలు చేపట్టడం లాంటివి వీరి విధుల్లో భాగమని శిక్షణ అధికారులు వారి విధులను తెలియజేశారు. ప్రస్తుతం 100 మాత్రమే ఉన్న ఈ మహిళా బృందం భవిష్యత్తులో 200 మందికి పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్ శిక్షణా అధికారులు చెప్పుకొచ్చారు.
నారీమణులు దేనికైనా.. ఏపనికైనా సమర్థులనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.. సమీప భవిష్యత్తు మహిళలు అడుగుపెట్టని రంగమంటూ ఉండదనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రక్షణ వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి తొలి అడుగువేసిన ఈ వంద మందికి మహిళామణులకు ‘హాట్సాఫ్’ చెప్తాం రండి..
Must Read ;- నేవీకి సెలక్ట్ కాకపోతే.. ఇంత ఘోరం చేస్తాడా?