జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించింది. నూతన కార్పొరేటర్లు ఓటింగ్ ద్వారా మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల వివరాలను త్వరలోనే తెలంగాణ స్టేట్ గెజిట్‌లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా, ప్రస్తుతం అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాల పరిశీలన జరుగుతోంది.
ఎన్నిక ఇలా..
మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా పాల్గొననున్నారు. మున్సిపల్ చట్టం 2005 ప్రకారం ఈ ఎన్నిక ఉండనుందని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే.. పార్టీలు విప్ జారీ చేయవచ్చు. విప్‌ను ధిక్కరించిన వారి ఓటు కూడా ఈ మేయర్ ఎన్నికలో చెల్లుబాటు అవుతుంది. అనర్హత వేటు అంశం మేయర్ ఎన్నికల్లో వర్తించదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, సర్వసభ్య సమావేశానికి మాత్రమే సగం మంది సభ్యుల హాజరు, కోరం తప్పనిసరి అని తెలిపింది ఎన్నికల సంఘం.దీంతో మేయర్ ఎన్నికకు మేజిక్ ఫిగర్ అవసరం లేదని తెలుస్తోంది. ఒక్కరు కంటే ఎక్కువ మంది మేయర్ పీఠం కోసం పోటీ పడినా ఇదే తరహా ఎన్నిక ఉంటుంది. ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే ఎన్నికల సంఘం పర్యవేక్షణలో లాటరీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎన్నికల సంఘం ప్రకటించిన రోజున కోరం లేకపోయినా..ఎన్నిక జరిపే పరిస్థితి లేకపోయినా.. మరుసటి రోజు కూడా అవకాశం ఉంటుంది. అదీ సాధ్యం కాని పక్షంలో ఎన్నికల సంఘం మరో సారి తేదీని ప్రకటిస్తుంది.
Must Read ;- దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’
బీజేపీ ఫైర్..టీఆర్ఎస్ సైలెంట్
గత డిసెంబరులో 150 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 చోట్ల గెలుపొందగా బీజేపీ 48 చోట్ల గెలుపొందింది. తరువాత కొవిడ్‌తో లింగోజి గూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ చనిపోవడంతో ప్రస్తుతం బీజేపీ బలం 47గా ఉంది. 44సీట్లు ఎంఐఎం, 2 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయ వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ కార్పొరేటర్లతో ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయించారు. తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు ఈ వ్యూహం అమలు చేశారు. ఇటీవలి కాలంలోనూ తమతో 23మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కూడా ప్రకటించారు. తమ కార్పొరేటర్లను టచ్ చేస్తే.. మీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తామని పరోక్షంగా హెచ్చరికలూ జారీ చేశారని చెప్పవచ్చు. టీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు. సైలెంట్‌గా వ్యూహాల అమలు జరుగుతోందని చర్చ నడుస్తోంది.
టీఆర్‌ఎస్‌కే ఛాన్స్
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. కొత్త మేయర్ ఎన్నికకు మేజిక్ ఫిగర్ వర్తించదని చెబుతున్నారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్ల సంఖ్యను కలిపి..ఆ సంఖ్యలో 50శాతాన్ని కోరంగా చెబుతారు. అంటే ఈ ప్రకారం చూస్తే..193 (194లో ఒక ఓటు మరణించిన బీజేపీ కార్పొరేటర్ ది) మందిలో కోరం సంఖ్య 97 గా నిర్ణయిస్తారు. టీఆర్ఎస్‌కు 86, ఎంఐఎంకు 54, బీజేపీకి 49, కాంగ్రెస్‌కు ముగ్గురు చొప్పున సభ్యులు ఉంటారు. ఈ కోరం నిబంధన ..కేవలం సమావేశం జరిపేందుకు మాత్రమే పరిమితం అవుతుంది. సమావేశంలో మేయర్ ఎన్నిక జరిగే సమయానికి మెజార్టీని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఖ్యను బట్టి చూస్తే.. టీఆర్ఎస్ నుంచి సభ్యులంతా హాజరయ్యాక..మరో 12మంది మాత్రమే కోరం కోసం అవసరం అవుతారు. ఇక మేయర్ ఎన్నికకు కోరం అవసరం లేనందున..అప్పుడు ఉన్న సభ్యుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో..వారే మేయర్ అవుతారని చెప్పవచ్చు. ఈ ప్రకారం చూస్తే.. టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకోనుందని అంచనా వేయవచ్చు.
Also Read ;- పట్టు సడలుతోంది.. కవితమ్మ ఇలాకాలో టీఆర్ఎస్‌కు భారీ షాక్