ఆమె ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఎటువంటి ఇబ్బందిలేని ఉద్యోగం.. హాయిగా సాగిపోతున్న జీవితం. తన ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఓ బుల్లి శిశువుకు జన్మనిచ్చిందో హర్ష. మాతృత్వపు సెలవుల్లో అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ రోజులు గడుపుతుంది. అందరిలాగే తన బిడ్డకు అత్యుత్తమైనవి అందించాలని ఆశపడింది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావించింది. బిడ్డతోపాటు.. ప్రసరం కారణంగా తన ఆరోగ్యం కూడ చాలా ముఖ్యం కనుక ప్రసవించిన మహిళలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే సైట్స్ ఏవైనా ఉన్నాయా అని వెతకింది. కానీ, ఆశ్చర్యమేమిటంటే.. అలాంటి సైట్ ఒక్కటి కూడా లేదు. అప్పుడే ఆమె భర్త జుగుల్ తచేరి ఇచ్చిన ఓ సలహా తన జీవితంతో పాటు కొన్ని వందలమంది మహిళల జీవితాన్ని మలుపుతిప్పింది.
ఆహారమే.. ఆరోగ్యం..
ప్రసవం తర్వాత తిరిగి ఆరోగ్యాన్ని పుంజుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందునా చంటి బిడ్డ బాగోగులు కూడా చూసుకోవాలి. తల్లి ఏది తిన్నా అది బిడ్డపైన ప్రభావం చూపిస్తాయి. ఇదే ఆలోచనే హర్షను ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతికేలా చేసింది. ప్రత్యేకంగా ప్రసవించిన మహిళల కోసం ఫుడ్ అంటూ లేకపోవడంతో హర్ష చాలా నిరాశ చెందింది. ఆ సమయంలోనే ఆమె భర్త జుగుల్, నీలాగే ఎందరో ఇలా ఇబ్బందిపడేవారుంటారు. మరి వారందరి సమస్యను పరిష్కరించేలా నువ్వెందుకు ఆలోచించకూడదు. ప్రసవించిన మహిళలకు మాత్రమే కాదు.. ఇంటి నుండి దూరంగా ఉంటూ.. ఇంటి భోజనం తినాలనుకునే వారి గురించి ఒక సైట్ నువ్వే మొదలుపెట్టచ్చు అనే మాటే తన స్టార్టప్‌కు అంకురార్పణ చేసేలా చేసిందంటోంది హర్ష. 2014 ఆగస్టులో తన ఆలోచనకు రూపమిచ్చారు హర్ష.
‘మసాలా బాక్స్’ అనే పేరెలావచ్చింది?
ఈ ఫుడ్ సైట్‌కి మసాలా బాక్స్ అనే పేరు పెట్టడం వెనకల చిన్న కథ ఉంది. హర్ష తన బామ్మ వంటచేసే సమయంలో ఎక్కవగా తనతోనే ఉండేది. ఆ సమయంలో వాళ్ల బామ్మ మసాలా బాక్స్ తనని ఎక్కువగా ఆకర్షించింది. అంతేకాదు.. ఈ పేరు తన బామ్మను గుర్తు చేస్తుందని చెప్పుకొచ్చింది హర్ష. వీటితోపాటు మరొక కారణం కూడా ఉంది. ముఖ్యంగా కస్టమర్లకు చాలా సులభంగా గుర్తుండే పేరు కావాలనే ఉద్దేశంలో ఈ పేరును ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చింది హర్ష.
Must Read ;- 20 వేలతో మొదలై.. నేడు 1,000 కోట్లకు చేరిన ‘మిసెస్ బెక్టార్’ బిజినెస్
20 మందితో మొదటి అడుగు..
ఫుడ్ సైట్ స్టార్ట్ చేయాలంటే అందుకు తగ్గట్టు ముందుగా వంటవాళ్లు కావాలి. కానీ, వాళ్లు ప్రొవేషినల్స్ అవడం ముఖ్యం కాదు. కమ్మని ఇంటి భోజనం చేయగలిగేవారు కావాలి. అంతేకాదు.. భోజనం చిట్కాలు తెలుసుండాలి. అందుకే హర్ష తన మొదటి అడుగులో భాగంగా ఇంటిపట్టున ఉంటూ నోరూరించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండగలిగే 100 మందిని పరీక్షించి.. అందులో 20 మందిని ఎంపిక చేసుకుంది. దాదాపు అందరూ సాధారణమైన మహిళలు.. గుర్తింపు లేకపోయినా కమ్మని భోజనాన్ని వంటగలిగే వంటవాళ్లు. అలాంటి వారిని ఎంపిక చేసుకుని తన సైట్‌ని మొదటగా కరాచిలో మొదలుపెట్టింది. మొదట్లో అందరిలాగే అర్డర్లు లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ వదలరంటే అతిశయోక్తి కాదు అన్నట్లుగా తను నిర్వహించింది.
3 రోజులు మాత్రమే వంట
అలా మెల్లగా మొదలైన హర్ష ప్రయాణం దాదాపు 200 మంది వంటవాళ్లను తీసుకునే స్థాయికి ఎదిగింది. అందులో ఎక్కువగా మహిళలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. ఇందులో పనిచేసే వంటవాళ్లు 3 రోజులు మాత్రమే వంట చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వంట చేయడం అనేది అద్భుతమైన కళ. అటువంటి దానిపైన విసుగురాకూడదు. ప్రతి రోజు చేస్తే అదొక పనిగా మారిపోతుంది. అలా అవ్వడం తనకు ఇష్టం లేదంటుంది హర్ష. ఎప్పటికప్పుడు సరికొత్త వంటలతో సిద్ధం కావాలనేది తన ఆలోచన. ఇప్పటి వరకు 500 వందలకుపైగా వంటకాలను తమ వంటవాళ్లు సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఎక్కువగా బిరియానీలోని వివిధ రకాలకు ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయని చెప్పుకొచ్చింది ‘మసాలా బాక్స్’ అధినేత హర్ష.
కరోనాతో చిన్న కుదుపు
ఏ ఆటంకం లేకుండా జరిగిపోతున్న సందర్భంలో కరోనా దెబ్బకు కొంతకాలం అన్ని పనులు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తిరిగి మొదలుపెట్టిన సమయంలో మెల్లగా ఆదరణ లభిస్తుంది. కరోనా కారణంగా బెంగళూరులో మాత్రమే ప్రస్తుతం సేవలను అందిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా దాదాపు 1500 ఆర్డర్లు వస్తున్నాయంటే ‘మసాలా బాక్స్’ రుచి గురించి వేరే చెప్పాలా. మరి బెంగుళూరుకు వెళ్లినపుడు మసాలా బాక్స్ ని టేస్ట్ చేయడం మరిచిపోకండి.
Als Read ;- స్విగ్గి విజయగాధ!