తెలుగు నేల ఉమ్మడిగా ఉన్నప్పుడు.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలుగు నేల రాజకీయాల్లో కీలక మార్పులే చోటుచేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన నేతలు రాష్ట్ర విభజన తర్వాత అడ్రెస్ లేకుండాపోయారు. అలాంటి వారి జాబితా చాలా పెద్దగానే ఉన్నా.. ఆ జాబితాలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ కూడా ఉన్నారనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా బలమైన నేతగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా రాజకీయాల్లోకి దింపేశారు. ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేనాటికే.. జేసీ ఫ్యామిలీ బిజినెస్ వ్యవహారాలను ఓ రేంజికి తీసుకెళ్లారు. తర్వాత ఒకరు అనంతపురం పార్లమెంటు నుంచి, మరొకరు తాడిపత్రి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతూ తమదైన శైలిలో రాజకీయం చేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ఈ అన్నాదమ్ములు.. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. టీడీపీలోకి జంప్ కొట్టేశారు. వీరి సీనియారిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వీరికి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు జేసీ బ్రదర్స్ మరింతగా డైలమాలో పడిపోయారు. పార్టీ నుంచి వీరికి మంచి మద్దతే లభిస్తున్నా.. ఎందుకనో వీరు అసంతృప్తిగానే ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో జేసీ సీనియర్
శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. అలాంటి సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఆ కోలాహలాన్ని తనవైపునకు తిప్పేసుకుంటూ తెలంగాణ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో కారు దిగిన ఆయన మీడియా ప్రతినిధులు తేరుకోకముందే.. వడివడిగా అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఆఫీసుకు వెళ్లిన జేసీ.. సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆ పక్కనే ఉన్న మంత్రి కేటీఆర్ కార్యాలయంలోకి వెళ్లి ఆయనతోనూ బేటీ అయ్యారు. ఆ తర్వాత నింపాదిగా బయటకు నడుచుకుంటూ వచ్చారు. లోపలికి వెళ్లేటప్పుడు మీడియాతో మాట్లాడని జేసీ.. బయటకు వచ్చినప్పుడు కూడా మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయేందుకు సిద్ధమైతే.. ఆయనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు విషయం ఏమిటని ఆరా తీశారు. మీడియాను చూస్తేనే ఓ రేంజిలో ఉత్సాహాన్ని చూపే జేసీ తన మనసులోని మాటను బయటపెట్టేశారు.
రాజకీయంగా నష్టపోయారట
ఈ సందర్భంగా జేసీ దివకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం తాము రాజకీయాల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నామని, తెలంగాణను వదిలేసి ఎంతో నష్టపోయామని కూడా ఆయన తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారంటే.. ‘‘తెలుగు నేల విభజనతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయాం. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయాం. ఆంధ్రాను వదిలేసి తెలంగాణ వస్తా. జానా రెడ్డి నాకు మంచి మిత్రుడు. అయ్యో పాపం ఓడిపోతాడని బాధతోనే అన్నా’’ ఇలా తనకు ఏది గుర్తుకు వస్తే అదే మాటను ఏమాత్రం బేషజం లేకుండా జేసీ చెప్పేశారు. అయినా జేసీ తెలంగాణకు వస్తానంటే.. కేసీఆర్ ఒప్పుకుంటారా? అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక్క జేసీనే కాదు ఎవరు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అడ్డుకోలేరు గానీ.. రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటేనే అసలు సమస్య వచ్చి పడుతుంది. మరి రాజకీయాల ప్రస్తావన లేకుండానే జేసీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తారా? లేదంటే ఇంకేదైనా వ్యూహం ఉందా? అన్న దిశగా ఆసక్తికర చర్చలకు తెర లేసింది.
Must Read ;- డబుల్ షాక్ దిశగా కేసీఆర్ .. వ్యూహమేంటో?











