ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను చేర్చేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కొత్త జట్ల ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. కొత్త జట్లు 2022 ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తాయి. అప్పుడు 94 మ్యాచ్‌లతో లీగ్ నిర్వహించనున్నారు.
2022 సీజన్ లో పది జట్లు…
క్రికెట్ అభిమానులకు శుభవార్త. 2022 సీజన్ నుంచి ఐపీఎల్‌లో పది జట్లు బరిలో దిగనున్నాయి. గురువారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు నిర్ణయించారు. 2021 సీజన్లో 9 లేదా 10 జట్లు బరిలోకి దిగుతాయని భావించారు. కానీ ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలకు దీటుగా జట్లను ఎంపిక చేసుకోవడానికి కొత్త ఫ్రాంచైజీలకు తగిన సమయం ఉండదనే భావన వ్యక్తమైంది.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో…
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చే విషయమై ఐసీసీ వేసిన బిడ్‌కు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. లాక్డౌన్ ప్రభావంతో జీతాల్లేక ఇబ్బందులు పడ్డ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు(పురుషులు, మహిళలు) పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
కొత్త ఒప్పందం…
ఇక 2022లో రెండు జట్ల చేరికతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు మరిన్ని పెరుగుతాయి. టీవీ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్‌కు ఇది లాభించే ఆంశం. అదనపు మ్యాచ్‌ల కవరేజీపై బిసిసిఐ, ఆ ఛానల్ మధ్య కొత్త ఒప్పందం కూడా ఉంది. ఇక ఐపీఎల్ 2021 తో స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ హక్కులు కూడా ముగియబోతున్నాయి.
ఆ ఇద్దరూ ఆసక్తి…
గౌతమ్ అదానీతోపాటు గతంలో రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్ ఫ్రాంచైజీకి యజమానిగా వ్యవహరించిన సంజీవ్ గోయెంకా కొత్త జట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. అదేవిధంగా బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీసీ బోర్డులో డైరెక్టరుగా గంగూలీ కొనసాగేందుకు పరిపాలన కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
Must Read ;- సూర్య ధైర్యంగా.. సహనంతో ఉండు: రవిశాస్త్రి