ఇండియా.. ఆస్ట్రేలియా మ్యాచ్ లో వింత నిరసన ఎదురైంది. నవదీప్ సైనీ ఏడో ఓవర్ వేయడానికి సిద్దం అయ్యే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఫ్లకార్డులు పట్టుకుని మైదానంలోకి ప్రవేశించారు. అదానీ కంపెనీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తామన్న రూ.7,300 కోట్ల రుణాలను వెంటనే నిలిపివేయాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునేలోపు వారు పిచ్ వద్దకు చేరుకున్నారు. వారు ధరించిన టీ షర్టులపై కూడా స్టాప్ అదానీ స్టిక్కర్లు అతికించి ఉన్నాయి.
పర్యావరణం నాశనం చేస్తున్నారు
గౌతమ్ అదానీ గుజరాత్ కు చెందిన పారిశ్రామికవేత్త. ఈయన కంపెనీ ఆస్ట్రేలియాలో బొగ్గుగనుల తవ్వకాల కోసం ఎస్బీఐ నుంచి రూ.7,300 కోట్ల రుణం కోసం ప్రయత్నించింది. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో బొగ్గు విచ్చలవిడిగా తవ్వడంతో అక్కడ అనేక పర్యావరణ సమస్యలు తలెత్తున్నాయి. ఆస్ట్రేలియాలో బొగ్గుగనుల తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా అదానీ కంపెనీకి ఎస్బీఐ రుణం ఆపి వేస్తే బొగ్గుగనుల తవ్వకాలు నిలిపివేస్తారని పర్యావరణ ఉద్యమకారులు భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇండియా..ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యలో వారు ఫ్లకార్డుల ద్వారా నిరసన తెలిపారు.
రుణం ఇవ్వడం లేదు
అదానీ కంపెనీకి ఆస్ట్రేలియాలో బొగ్గు తవ్వకాలకు ఎస్బీఐ రుణం ఇవ్వడానికి 2014లోనే నిరాకరించిందని తెలుస్తోంది. ఇప్పటికే అనేక ప్రైవేటు బ్యాంకులు కూడా అదానీ కంపెనీకి రుణాల ఇచ్చేందుకు ముందుకు వచ్చి, తరవాత వెనక్కు తగ్గాయి. ఆస్ట్రేలియాలో చాలా కీలక ప్రాంతంలో అదానీ కంపెనీ బొగ్గు తవ్వకాలకు లైసెన్సులు తీసుకున్నారు. అక్కడ బొగ్గు తవ్వకాలను నిలిపివేసేందుకు పర్యావరణ ఉద్యమకారులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అందుకే అనేక బ్యాంకులు అదానీ బొగ్గు తవ్వకాల కంపెనీకి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
Must Read ;- కపిల్, చిద్దూ బాటలో నబీ నిరసన గళం










