ఆడపిల్లలకు రక్షణ గాల్లో దీపంలా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్య ధోరణి వహిస్తే.. దాని ఫలితం ఒక ఆడపిల్ల ప్రాణం అవుతుంది. ఇదేమీ కొత్తగా వస్తున్న ఆరోపణలు కాదు.. యావత్ భారతదేశాన్ని కుదిపేసిన దిశ కేసులో కూడా పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నారు. దానిని సరిచేసుకోవడానికి ఎన్నో తంటాలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనంతపురం బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య కేసులో కూడా అదే కోణం వెలుగుచూసింది. బాధితురాలి తల్లే స్వయంగా ఈ విషయాన్ని ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మొరపెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో సరికొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి.
జాతీయ స్థాయి క్రీడాకారిణి కూడా..
అనంత బాధితురాలు సామాన్య బ్యాంకు ఉద్యోగి మాత్రమే కాదు.. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి కూడా కావడం గమనార్హం. అలా గుర్తింపు పొందిన వారికే దిక్కులేకుంటే.. ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. ఉద్యోగి హత్య విషయం తెలిసిన మరుక్షణం బాధితురాలి తల్లిని ఫోన్ ద్వారా పరామర్శించారు చంద్రబాబు. ప్రతి పక్ష నాయకుడితో తన గోడును వెల్లబోసుకున్న ఆ తల్లి బాధను వింటే కళ్లు చెమర్చని వారుండరు. సంవత్సర కాలంగా రాజేష్ వేధిస్తున్నాడు. తన భర్త డ్రైవర్ కావడంతో అందుబాటులో లేనందున ఫోన్ ద్వారా పోలీసులకు పలు మార్లు మా బాధను మొరపెట్టుకున్నా వినపించుకోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అర్ధరాత్రి సమయంలో కూడా అతను ఇబ్బంది పెడితే పోలీసులకు ఫోన్ చేస్తే కనీసం పట్టించుకోలేదని చెప్పారు. ఆఖరికి చనిపోయిన రోజు కూడా ఇంకా ఇంటికి రాలేదని పోలీసులకు మొరపెట్టుకుంటే.. ‘ఉద్యోగం చేస్తోంది కదా.. చిన్నపిల్లేం కాదు.. వస్తాది లే’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితురాలి తల్లి తన బాధను వెల్లబుచ్చింది. అందరూ కలిసి నా కుమార్తెను చంపేశారు.. తనని బతకనివ్వలేదంటూ ఆ తల్లి రోదిస్తుంటే సముదాయించడం ఎవరితరం కాలేదు.
Must Read ;- దిశ చట్టం అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలం
వాళ్ల నిర్లక్ష్యమే చంపేసింది..
మేము చెప్పిన నాడే పోలీసులు పట్టించుకుని ఉంటే నా కుమార్తె బతికేదని ఆ తల్లి వాపోయింది. ఇష్టం లేదంటూ తిరస్కరించడం వల్లే ఇలాంటి పనికి ఒడికట్టాడని చెప్పుకొచ్చింది. ఫోన్ చేసి కంప్లెయింట్ ఇస్తే.. స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. ఒక్క ఆడదాన్ని ఎలా రాత్రి టైంలో వెళ్లేది అంటూ ఆ తల్లి వాపోయింది. ఫిర్యాదు చేసినపుడే పోలీసులు పట్టించుకుని ఉంటే నా కూతురు ఈ రోజు నా కళ్లముందు సజీవంగా ఉండేదని అన్నారు.
ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకుని, వారికి న్యాయం జరిగేలా పార్టీ తరపున పోరాడతామని హామి ఇవ్వడంతోపాటు.. ఆ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదంటూ ఏపీ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు. బాధితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం ఖరీదు వారి ప్రాణమా అంటూ పోలీసులను సైతం ప్రశ్నించారు. దిశ ఒక ఫేక్ చట్టం అంటూ విమర్శించారు. అసలు రూపదాల్చని దిశ చట్టానికి పోలీస్ స్టేషన్ పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. గన్ కంటే ముందు జగన్ వస్తారు అన్నారు…ఎక్కడ గన్…ఎక్కడ జగన్? 19 నెలల్లో జరిగిన క్రైమ్ గతం లో ఎప్పుడైనా జరిగిందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Also Read ;- నిద్ర లేచిన నాలుగో సింహం.. చంద్రబాబుపై ఆగ్రహం