తాజాగా ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. “కెమెరామెన్ గా నేను చాలామంది దర్శకులతో పనిచేశాను .. జంధ్యాలగారితో కలిసి 13 సినిమాలకు పనిచేశాను. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఆయనను చూసింది చెన్నైలోనే. కోదండరామిరెడ్డి ఫస్టు సినిమా ‘సంధ్య’కి రచయితగా జంధ్యాలగారు పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యాము. ఎంతో సరదాగా సినిమాలను పూర్తిచేసేవాళ్లం.
జంధ్యాలగారు పరిచయం కావడానికి ముందు నా లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది. ఆయన పరిచయమైన తరువాత నా ఆలోచనా విధానం మారిపోయింది. ఆయన ‘శంకరాభరణం’ .. ‘సాగరసంగమం‘ .. ‘సప్తపది’ వంటి సినిమాలకు రాయగలరు. ‘అడవిరాముడు‘ .. ‘వేటగాడు‘ వంటి సినిమాలు కూడా రాయగలరు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైన వ్యక్తి .. గొప్ప స్నేహితుడు. అందుకే ఇప్పటికీ ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం.
S Gopal Reddy Emotional On Samsara Bandham Movie Review :
ఇక సినిమాటోగ్రఫర్ గా నా మొదటి సినిమా ‘సంసార బంధం'(Samsara Bandham ). ఆ సినిమా విడుదలైన తరువాత పేపర్లో రివ్యూ వచ్చింది. నా గురించి ఏం రాసి ఉంటారా అని ఎంతో ఆత్రుతగా చూశాను. ‘అంతా ఓకే ఒక్క ఫొటోగ్రఫీ తప్ప’ అని ఆ రివ్యూలో రాశారు. అది చదవగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. ఇక నేను కెమెరా మెన్ ను కాలేను .. అవకాశాలు రావని అనుకున్నాను. మళ్లీ అసిస్టెంట్ గా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ బాలు .. శోభన్ బాబు వంటివారు నా పనితీరును గురించి అక్కడక్కడ చర్చించడంతో అవకాశాలు పెరగడం మొదలైంది. అలా ఈ ప్రయాణంలో ఇంతవరకూ 114 సినిమాలు చేశాను” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- 30 ఏళ్ల నాటి ప్రయోగం..ఆదిత్య 369;











