నందమూరి నటసింహ బాలయ్య కి మాస్ ఇమేజ్ విపరీతంగా ఉంది. అందుకే తన సినిమాల్లో ఆయన మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. మాస్ డైలాగులు .. పాటలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. దర్శకులు కూడా ఆయన నుంచి అభిమానులు కోరుకునే కథలనే ఎంచుకుంటూ ఉంటారు .. అభిమానులు ఆశించే పవర్ఫుల్ పాత్రల్లోనే ఆయనను చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. అదే పద్ధతిలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవడం బాలయ్య కి అలవాటు. అందువలన ఆయన ఈ సినిమా పూర్తికాగానే, ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా బాలకృష్ణ లైన్లో పెట్టడం విశేషం. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించనున్నాడు.
బాలకృష్ణ – బి. గోపాల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాల్లో చాలా వరకూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. అలాంటి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుండటం, ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా కథ – మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు కోరుకునే యాక్షన్ .. ఎమోషన్ .. సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుందని సాయిమాధవ్ బుర్రా చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు తెలియనున్నాయి.
Must Read ;- బోయపాటి సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్