అందగాడు అంటే శోభన్ బాబు .. సోగ్గాడు అంటే శోభన్ బాబు అనేంతగా ఒక హీరో మహిళా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. తరాలు మారినా ఆ క్రేజ్ దరిదాపుల్లోకి కూడా వేరెవరూ వెళ్లలేకపోవడం కూడా సాధారణమైన విషయమేం కాదు. ఒక వైపున ఇల్లాలు .. మరో వైపున ప్రియురాలు .. ఇద్దరి మధ్యలో నలిగిపోయే సోగ్గాడు కథలను తెలుగు తెరపై పరుగులు తీయించిన కథానాయకుడిగా శోభన్ బాబు కనిపిస్తారు. డాన్సుల్లో స్పెట్స్ వాడటం .. మఫ్లర్ వాడటం ఆయనతోనే మొదలైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
శోభన్ బాబు తనని అభిమానించేవారికి ఒక హీరో మాత్రమే. కానీ తన సమకాలిక నటులకు ఆయన ఓ స్ఫూర్తి .. ఓ మార్గదర్శి అని చెప్పొచ్చు. కెరియర్ తొలినాళ్లలో ఆర్ధికంగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆ తరువాత ఆయన డబ్బుకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చారు. మట్టిని నమ్ముకున్న మనిషి ఎప్పుడూ చెడిపోడు అనే సూత్రాన్ని బలంగా నమ్మిన ఆయన, తనకి వచ్చిన ప్రతి రూపాయితో భూములను కొనుగోలు చేస్తూ వచ్చారు. అలా ఆయన కొన్న భూముల ఖరీదు ఇప్పుడు వేలకోట్లు పలుకుతున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మురళీ మోహన్ చెప్పారు.
శోభన్ బాబు మంచి బిజినెస్ మేన్ .. షేర్స్ అనే మాట చాలామందికి తెలియని రోజుల్లోనే ఆయన పెద్ద పెద్ద సంస్థల్లో షేర్లు తీసుకునేవారు. 1976 నాటికే ఆయనకి పెద్ద సంస్థల్లో షేర్లు ఉండేవంటే, ఆయన ఎంత ముందుచూపుతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. హీరోగా ఆయన కెరియర్ ఒక రేంజ్ లో సాగుతుండగానే, చెన్నైలోనేకాదు .. అక్కడి శివారు ప్రాంతాల్లోను ఆయన వేల ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆయన కొనుగోలు చేసిన ఆ భూముల ఖరీదు ఆయన చనిపోయేనాటికి 80 వేల కోట్ల వరకూ ఉండవచ్చునని మురళీమోహన్ అన్నారు.
చెన్నైలోని తన స్థిరాస్తులను చూసుకోవడానికి శోభన్ బాబు ఉదయాన్నే కార్లో బయల్దేరితే, సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారనీ, ఆ స్థాయిలో సంపాదించిన హీరో ఇండియాలోనే లేరని ఆయన చెప్పారు. తను రియల్ ఎస్టేట్ వైపుకు రావడానికి కారకులు కూడా శోభన్ బాబునే అని చెప్పుకొచ్చారు. ఒక్క మురళీమోహన్ మాత్రమే కాదు .. చంద్రమోహన్ .. శ్రీధర్ .. గొల్లపూడి .. ఇలా భూములు కొనుగోలు చేయడం ద్వారా చెన్నైలో స్థిరపడిన చాలామంది, తమకి ఆ సలహా ఇచ్చింది శోభన్ బాబు అనే అని చెప్పడం విశేషం.
Must Read ;- గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్!