తెలుగు తెరపై అమ్మ పాత్రల్లో నిర్మలమ్మ తరువాత స్థానం అన్నపూర్ణమ్మదేనని చెప్పొచ్చు. ఎంతోమంది అగ్రకథానాయకులకు .. అగ్రకథానాయికలకు అమ్మ పాత్రల్లో ఆమె ఒదిగిపోయారు. నిజ జీవితంలో అమ్మ స్థానంలో ఉన్నవారు ఎలా తమ పిల్లలతో మాట్లాడతారో .. మందలిస్తారో .. లాలిస్తారో .. అదేరకమైన బాడీలాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో అన్నపూర్ణమ్మ మెప్పించేవారు. నటనలో ఆమె చూపే సహజత్వమే ఆమె ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి కారణమైంది. 700ల సినిమాలకి పైగా నటించిన అన్నపూర్ణమ్మ ఈ వారం ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు.
“నా అసలు పేరు ‘ఉమ’ .. విజయవాడ సమీపంలోని ఒక గ్రామంలో పుట్టిపెరిగాను. 13వ ఏట నుంచే నాటకాలు వేసేదానిని. అప్పట్లో మురళీమోహన్ గారికి కూడా నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. ఆయన ద్వారానే సినిమాల్లోకి వచ్చాను. ‘నీడలేని ఆడది’ సినిమాతో నేను తెలుగు తెరకి పరిచయమయ్యాను. సి.నారాయణరెడ్డి గారు .. నా పేరును ‘అన్నపూర్ణ’గా మార్చారు. తొలినాళ్లలో కథానాయికగా ఒకటి రెండు సినిమాలు చేశాను. ఆ తరువాత నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాను. తల్లిపాత్రల్లో నేను ఎంతో బిజీ అయ్యాను .. అప్పటి నుంచి ఇప్పటివరకూ అంతా నన్ను గౌరవంగానే చూస్తున్నారు.
నేను చెన్నైలో ఉన్నప్పుడు ‘విలాసినీ రెడ్డి’ అని ఒక లేడీ డాక్టర్ గారు ఉండేవారు. 5 రూపాయల ఫీజుతోనే పేదలకు ఆమె ఎంతో ప్రేమగా వైద్యం చేసేవారు. నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను .. ఆ అమ్మాయిని డాక్టర్ చదివించి .. విజయవాడలో క్లినిక్ పెట్టించాలనుకున్నాను. విలాసినీ రెడ్డి మాదిరిగా పేదలకు అందుబాటులో ఉండేలా చేయాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి చదువు అబ్బలేదు .. 10వ తరగతికి మించి చదవలేకపోయింది. ఎంతగా చెప్పిచూసినా ప్రయోజనం లేకుండా పోయింది .. దాంతో నా కోరిక నెరవేరకుండా పోయింది.
18వ ఏటనే ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. ఆ మధ్య ఆ అమ్మాయికి ఒక ఆడపిల్ల పుట్టింది. అలా పుట్టిన పిల్లకి మాటలు రాలేదు. ఆ విషయం గురించి ఎంతగా బాధపడిందో తెలియదు. ఫలానా విషయాన్ని గురించి బాధపడుతున్నట్టుగా నాతో ఎప్పుడూ చెప్పనూ లేదు. మాటలు రాని పిల్లను కన్నావని ఎవరైనా ఏమైనా అన్నారేమో కూడా నాకు తెలియదు. ఓ రాత్రివేళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది .. దాంతో నా కోరిక అలాగే ఉండిపోయింది. నా మనవరాలికి ఇప్పుడు మాటలు వస్తున్నాయి .. కానీ ప్రయోజనం ఏవుంది? .. చూడటానికి వాళ్లమ్మ లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read ;- అమెరికా గ్రామీ అవార్డుల పోటీలో భారతీయ గాయని