జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 21న తిరుపతికి వెళుతున్నారు. తిరుపతిలో తన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సన్నాహకాలపై కూడా పవన్ చర్చించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో… తిరుపతి బైపోల్ బరిలో బీజేపీ పోటీకి దాదాపుగా సిద్ధమైపోయింది. ఈ విషయంలో ఇరు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పవన్ తిరుపతి పర్యటన.. ఇరు పార్టీల మధ్య తీరని అగాథాన్ని పెంచే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని పవన్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ కూడా అదే భావనతో ముందుకు సాగుతోంది. అంతేకాకుండా జనసేన కంటే ఓ అడుగు ముందున్న బీజేపీ తిరుపతిలో ఇప్పటికే దాదాపుగా ప్రచారాన్ని ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన ఏపీ శాఖ ముఖ్య నేతలు తరచూ తిరుపతికి వెళుతుండటం, అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కూడా జనసేనను బరిలోకి దించే దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వెరసి పవన్ తిరుపతి పర్యటన బీజేపీలో పెను కలవరాన్ని సృష్టించనుందని, అంతిమంగా ఇరు పార్టీల మధ్య పొత్తు కూడా వీగిపోనుందన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బల్లి దుర్గాప్రసాదరావు ఇటీవలే మరణించారు. దీంతో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఉప ఎన్నికలో మరోమారు సత్తా చాటి తన బలాన్ని నిరూపించుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో తనకు గట్టి పట్టున్నదని భావిస్తున్న టీడీపీ కూడా తిరుపతి బైపోల్స్ లో సత్తా చాటడం ద్వారా జనాల్లో వైసీపీ మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోందని చెప్పదలచుకుంది.
Must Read ;- ఎవరికివారే : తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన, బీజేపీ పోటీ
ఇదే భావనతో అన్ని పార్టీల కంటే ముందుగానే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… తిరుపతి ఉప ఎన్నికకు ఓ భారీ యంత్రాంగాన్నే ప్రకటించారు. ఆ కమిటీ ఇప్పుడు చురుగ్గా పనిచేస్తోంది కూడా. ఈ రెండు పార్టీలకు వాటి పంథాల్లో ఎలాంటి అవరోధాలు లేకున్నా… మిత్రపక్షాలుగా మారిపోయిన బీజేపీ, జనసేనలకు మాత్రం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ తాము పోటీ చేస్తామంటే… కాదు తామే పోటీ చేస్తామంటూ ఇరు పార్టీలు ప్రకటించుకున్నాయి. అయితే ఇరు పార్టీల అగ్రనాయకులు ఓ దఫా చర్చల సందర్భంగా ఇరు పార్టీల ప్రతినిధులతో ఓ కమిటీ వేసి ఎవరు పోటీ చేయాలన్న విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుందామని అనుకున్నాయి. అయితే ఆ చర్చలు మొదలు కాకముందే… బీజేపీ బరిలోకి దిగిపోయింది. ఈ విషయం పవన్ కు కాస్తంత ఇబ్బందికరంగానే మారడంతో పాటు తాను ఏం తక్కువ తిన్నానన్న భావనకు ఆయన వచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీకి చెక్ పెట్టేందుకే ఈ నెల 21న తిరుపతి పర్యటనను పవన్ ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి పర్యటనలో పార్టీ పీఏసీ భేటీతో పాటు తిరుపతి ఉప ఎన్నిక విషయంపైనా పార్టీ వర్గాలతో పవన్ చర్చలు జరపనున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా… తిరుపతిలో పవన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఓట్లే అధికంగా ఉన్నాయని చెప్పాలి. తన వర్గానికి చెందిన అధిక ఓట్లుంటే తన పార్టీ అభ్యర్థిని కాకుండా బీజేపీ అభ్యర్థిని ఎలా బలపరుస్తామన్నది పవన్ వాదనగా వినిపిస్తోంది.
Must Read ;- బాబుపై జగన్ పగ ఫలితం.. కర్ణాటకకు టెస్లా కంపెనీ
అంతేకాకుండా 2019 ఎన్నికల్లో తనకు తగిలిన భారీ షాక్ నుంచి ఉపశమనం పొందేలా తిరుపతి ఉప ఎన్నికను వాడుకోవాలన్నది పవన్ భావనగా తెలుస్తోంది. ఇవేవీ పట్టించుకోకుండా తెలంగాణలో సత్తా చాటిన మాదిరిగా తిరుపతిలోనూ తాను సత్తా చాటుతానంటూ బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తున్న వైనం పవన్ కు నచ్చడం లేదట. దీంతోనే బీజేపీతో ఒక్క మాట కూడా చెప్పకుండానే పవన్ తిరుపతి పర్యటనను ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ తిరుపతి పర్యటన గురించి తెలుసుకున్న బీజేపీ అధిష్ఠానం కూడా తిరుపతిలో పవన్ ఏం చేస్తారో చూద్దామన్నట్టుగా సైలెంట్ గానే ఉంది.
అయితే తిరుపతి పర్యటనలో ఉప ఎన్నికలకు సంబంధించి పవన్ ఏ మాత్రం ప్రకటన చేసినా… అది బీజేపీ, జనసేనల మధ్య ఉన్న మైత్రికి తీరని దెబ్బగానే పరిశీలకులు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించి నిర్ణయం తీసుకుందామని అనుకున్నప్పుడు… తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పవన్ తిరుపతి పర్యటనను ఖరారు చేసుకోవడం, ఉప ఎన్నికపై చర్చలు జరపడం సరికాదన్నది బీజేపీ వాదనగా వినిపిస్తోంది. అంతేకాకుండా తమను సంప్రదించకుండా తిరుపతి ఉప ఎన్నిపై పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వెనువెంటనే కాస్తంత స్ట్రాంగ్ గానే ప్రతిస్పందించాలని కూడా బీజేపీ యోచిస్తోందట.
అంటే… తిరుపతి పర్యటనలో పార్టీ వ్యవహారాలకు పవన్ పరిమితమైతే ఫరవా లేదు గానీ… ఉప ఎన్నికపై పవన్ ఏం మాట్లాడినా కూడా బీజేపీ గట్టిగానే బదులు ఇవ్వడం ఖాయమేనన్న మాట. ఇదే జరిగితే… ఇరు పార్టీల మధ్య కుదిరిన స్నేహం కూడా కొడిగట్టినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం… మరి తిరుపతి పర్యటనలో పవన్ ఏం చేస్తారో, దానికి బీజేపీ ఎలా ప్రతిస్పందిస్తుందో? అంతిమంగా ఇరు పార్టీల మధ్య మైత్రి ఇకపైనా కొనసాగుతుందో?, లేదంటే… పవన్ తిరుపతి పర్యటనతోనే ముగుస్తుందో?
Also Read ;- కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!