విశాఖలో ఐదు చోట్ల విలువైన ప్రభుత్వ భూములు అమ్మాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. తాజాగా విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి విడుదలైన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. గతంలోనే ఏపీ బిల్డ్ పేరుతో భూములు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నించడంపై హైకోర్టు స్టే విధించిందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విశాఖపట్నంలో భూముల అమ్మకాలకు కూడా గతంలో విధించిన స్టే వర్తిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. టెండర్లు ఫైనలైజ్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విలువైన భూములు అమ్మకానికి..
విశాఖలో ఐదు చోట్ల ఉన్న దాదాపు రూ.1800 కోట్ల విలువైన భూములు అమ్మాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో గుంటూరు నగరంలోని కూరగాయల మార్కెట్ స్థలం అమ్మకానికి పెట్టింది. దీనిపై కొందరు హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై కోర్టు స్టే విధించింది. ఇప్పుడు కూడా ఆ ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు గుర్తు చేసింది.
Must Read ;- పరిపాలనా రాజధానా.. విశాఖను అమ్మేసేందుకు వైసీపీ ప్లానా?











