విశాఖలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన ప్రారంభించక ముందే ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. సీఎం పర్యటనను అడ్డుకుంటామని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు హెచ్చరించడంతో నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం నీరుగారుస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్మిక సంఘాల నాయకుడు అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. కార్మికసంఘాల నేతలతోపాటు టీడీపీ నేతలను కూడా గృహనిర్బంధం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైసీపీ అనుకూల కార్మిక సంఘాలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న కార్మిక సంఘాల నేతలు ఇవాళ ఎయిర్ పోర్టులో సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 14 కార్మిక సంఘాల నేతలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కార్మిక సంఘాల నాయకులకు 5 నిమిషాల సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సీఎం జగన్మోహన్‌రెడ్డి కార్మికులకు ఎలాంటి హామీ ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. విశాఖలో గంటసేపు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని అధికారులు వెల్లడించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా 2 వేల మంది పోలీసులను మోహరించారు. ఎయిర్ పోర్టులోకి ఎవరినీ అనుమతించడం లేదని తెలుస్తోంది.
Must Read ;- విశాఖ ఆత్మను అమ్మాలనుకుంటున్న జగన్.. చంద్రబాబు ధ్వజం