ఒడిశా ఒత్తిడి వల్లే కేంద్రం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తోపాటు స్టీల్‌ప్లాంట్ సీఎండీలుగా పనిచేసిన వారిలో ఎక్కువమంది ఆ రాష్ర్టానికి చెందినవారే కావడంతో తెరవెనుక కుట్రను అమలు చేశారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఆయన నేతృత్వంలో రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సీపీఐ, సీపీఎం, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఒడిశాపై అక్కసు వెళ్లగక్కారు. ప్రైవేటీకరణ కారణాలపై కార్మిక సంఘాలతో చర్చించినప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయన్నారు.
ఒడిశానే కారణం..
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రంతోపాటు ఒడిశా ప్రభుత్వం, ఆ ప్రాంతానికి చెందిన అధికారుల పెత్తనం కొనసాగుతోందని, ప్లాంట్‌ను దక్కించుకునేందుకు కేంద్రంలోని కొందరు పెద్దలు, పారిశ్రామికవేత్తలు కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు. దీనికి ఒడిశా నేతలు, అధికారులు సహకరిస్తున్నారని, రాయ్‌బరేలిలోని వ్యాగన్ వీల్స్ పరిశ్రమకు స్టీల్‌ప్లాంట్ నుంచి రూ.2 వేల కోట్లు తరలించుకుపోయి, ఇంతవరకూ తిరిగివ్వలేదని విమర్శించారు. గతంలో సీఎండీగా పనిచేసిన పీకే చాంద్ రూ.2వేల కోట్ల కుంభకోణానికి పాల్పడడం కూడా స్టీల్‌ప్లాంట్ ఆర్థికస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రూ.1,350 కోట్లకు పోస్కోకు కేంద్రం విక్రయించినట్టయితే, ఆ మొత్తాన్ని విశాఖ వాసులే పోగుచేసి, ప్లాంట్‌ను కొనుగోలు చేసుకుని నిర్వహించుకుంటారని విజయసాయిరెడ్డి చెప్పారు.
Must Read ;- నన్ను నమ్ముకో.. అన్నీ అమ్ముకో..: జగన్ ప్రతిపాదనపై ఉద్యోగుల ఆగ్రహం
చేతకాని విజయసాయీ.. ఎందుకీ అక్కసు!
తమ వైఫల్యాలను ఎవరో ఒకరి మీద రుద్ది పబ్బం గడుపుకోవడం వైసీపీ నాయకులకు బాగా అలవాటైపోయింది. విశాఖ ఉక్కు విషయంలో కూడా అదే సూత్రాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ వైఫల్యాలన్నింటికీ సాధారణంగా చంద్రబాబునే బాధ్యుడిని చేసే విజయసాయి.. ఈ సారి మాత్రం ఎందుకో ఒడిశా మీద పడ్డారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడం ఎలాగో తెలియని ఈ ప్రభుత్వానికి.. కనీసం ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడం కూడా చేతకాదని తేలిపోయింది. మాట్లాడితే.. ఢిల్లీ వెళ్లి ప్రధానితో ఫొటోలు దిగే ఈ ఆర్థిక నేరగాడు.. విశాఖ గురించి ప్రధానితో ఎందుకు మాట్లాడలేకపోతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పకపోయినా.. జనాలకి తెలియంది కాదు కదా.. సాయిగారి బాగోతం.
అవినీతి చక్రవర్తులు
11 అవినీతి కేసుల్లో ఏ1 ముద్దాయిగా సీఎం, ఏ2 ముద్దాయిగా ఎంపీ ఉంటే.. రాష్ట్రం గతి ఎలా తయారవుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్లిద్దరికీ.. రాష్ట్రం బాగు గురించి ప్రధానిని అడగాలంటే భయం.. ఏ కేసులో లోపలేయిస్తారోనని! రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. వీరికి తమపై ఉన్న కేసులే ముఖ్యం. ఏ ప్రధాని అయినా.. ఇలాంటి సీఎం ఉండాలనే కోరుకుంటారు. ఎందుకంటే.. తాము ఏం చేసినా.. కిక్కురుమనకుండా, తమ చెప్పుచేతల్లో ఉంటారని. బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఏమీ విదిలించని కేంద్రం.. ఇప్పుడు ఉన్నది కూడా ఊడ్చుకెళ్లిపోతోంది. దీనిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన ప్రభుత్వం.. మొహమాటపు లేఖలతోనే సరిపుచ్చుతోంది.
చేతకాదు.. ఆపలేరు..
ఇప్పుడు మన సాయిగారేమో.. తీరిగ్గా ఒడిశాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇళ్లు చక్కబెట్టుకునే విధానం తెలియక.. పక్కింటోడ్ని ఆడిపోసుకుంటున్నట్లుంది సాయి గారి వ్యవహారం. ఒడిశా వాళ్లు అన్ని కుట్రలు చేస్తుంటే.. ఆయనేం చేస్తున్నారో అర్థం కాదు. సరే.. ఒడిశా కుట్రలు చేసిందే అనుకుందాం.. ఆయన కూడా ఏదో ఒకటి చేసి రాష్ట్రానికి చిన్న ప్రాజెక్టును తీసుకురాగలరా? అంటే.. సమాధానం ఉండదు. ఒడిశా ప్రభుత్వంపై అవినీతి మరకులు లేవు. మరి మన వాళ్ల పరిస్థితో.. కిందంతా అవినీతి బొక్కలే. రాజకీయ కుట్రలకు మినహా.. రాష్ట్ర అభివృద్ధికి సమయం కేటాయించని ఈ ప్రభుత్వానికి.. ఒడిశాను విమర్శించే హక్కు లేదు. చేతనైతే కొత్త ప్రాజెక్టులు తీసుకురండి.. కాకపోతే ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోండి. అంతేగానీ.. ఉబుసుపోని మాటలతో ఒరిగేదేమీ ఉండదని తెలుసుకోండి..!
Also Read ;- మూడేళ్ల క్రితమే స్కెచ్.. విశాఖ ఉక్కును ‘పోస్కో’ పరం చేసేస్తారా?