గుండె కోసం విలవిల్లాడుతున్న ఓ ప్రాణం కోసం.. నిర్జీవంగా మారబోతున్న మరో దేహం నుంచి ఓ ‘హృదయం’ విడివడింది. ఎక్కడో ఉన్న మరో దేహాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. గంటలు పట్టే గమ్యాన్ని నిముషాల్లో చేరింది. మినుకు మినుకుమంటున్న ఆ దేహానికి ఆయువు పెంచింది. ఈ క్రమంలో.. దాతల ఔదార్యం, వైద్యులు, అధికారుల చొరవ, మెట్రో సహకారం.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది.
ఓ నిండు ప్రాణం నిలబెట్టిన మెట్రో
హైదరాబాద్ మెట్రో రైలు ఒక నిండు ప్రాణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించింది. ప్రాణంలేని రైలేంటీ.. ప్రాణాన్ని కాపాడమేంటని అనుకుంటున్నారా? అవునండీ.. మీరు విన్నది.. నేను అన్నది నిజమే..! ప్రస్తుత కాలంలో అవయవాల మార్పిడి శస్త్రచికిత్స అనేది సాధారణమైపోయింది. మనిషి మరణించిన అనంతరం అవయవాలను తగువిధంగా భద్రపరచి వాటిని వేరే వారికి అమర్చవచ్చు. వీటిన్నంటిలో చాలా కష్టమైనది గుండె మార్పిడి. దీన్ని చేయాలంటే మనిషి పూర్తిగా చావకూడదు.. అలాగని స్పందించే స్థితిలో ఉండకూడదు. అలాంటి సమయంలో మాత్రమే ఇలాంటివి చేస్తారు.
బ్రెయిన్ డెడ్ అయితేనే ఇలా..
ఎవరైనా ప్రమాదం కారణంగానో.. అనారోగ్యం కారణంగానో.. బ్రెయిన్ డెడ్ పరిస్థితికి చేరుకున్నప్పుడు.. వాళ్లు తిరిగి మామూలు స్థితికి వచ్చే పరిస్థితి పూర్తిగా లేదని తెలిసిన తర్వాతే డాక్టర్లు గుండె దానం చేయవచ్చనే సలహా ఇస్తారు. ఈ ప్రతిపాదనకు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే.. నిర్ణీత సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల గుండెను.. వేరొకరికి అమర్చవచ్చు. నిర్ణీత సమయం ఏ మాత్రం దాటిన చేసిన ప్రయత్నమంతా వృథా అవుతుంది. గుండె ఒక్కసారి అగిందా.. ఇక అంతా వేస్టైపోతుంది. అందుకోసమే.. గుండె మార్పిడి అన్ని అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు పూర్తి భిన్నమైంది.
Must Read ;- రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
https://twitter.com/ravitedz/status/1356644040150683648?s=20
మెట్రో గ్రీన్ ఛానల్..
నల్గొండ జిల్లాకు చెందిన నర్సిరెడ్డి అనే రైతు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. పరిస్థితిని గమనించిన డాక్టర్లు, రైతు అవయవాలు దానం చేస్తే కనీసం వేరే వాళ్లకు ఉపయోగపడతాయని కుటుంబ సభ్యలకు సలహా ఇచ్చారు. అంత దుఃఖంలోనూ.. ఈ ప్రతిపాదనను ఒప్పుకున్నారు రైతు కుటుంబం. అవయవాల దానానికి ముందు కొచ్చారు. వారు ఒప్పుకున్న వెంటనే.. వైద్యులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి వర్గాలు. వారి సమాచారానికి స్పందించిన జుబ్లీహీల్స్ అపోలో ఆసుపత్రి ఓ రోగికి గుండె మార్పిడి అవసంముందని.. ఆ వివరాలను కామినేని ఆసుపత్రికి అందించారు. వాటిపై స్పందించిన ఆసుపత్రి వర్గాలు వెంటను గుండెను అందించడానికి అంగీకారం తెలిపారు. ఎల్బీ నగర్ నుండి జూబ్లీహీల్స్‌కి వాహనంలో గుండెను తరలించాలంటే కనీసం 3 గంటలు పడుతుంది. అప్పటికప్పుడు ట్రాఫిక్ మొత్తాన్ని మార్చడం కూడా కష్టమని భావించిన పోలీసులు మెట్రోను సంప్రదించారు.
మెట్రోలో గెండెను తరలించారు..
పోలీసుల ప్రతిపాదనకు వెంటనే మెట్రో కూడా సానుకూలంగా స్పందించింది. ఎల్బీనగర్ చి జూబ్లీహీల్స్ వరకు మెట్రో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు విమానాల్లో, వాహనాల్లో తరలించడం మనం విన్నాం. ఇప్పుడు, మొదటి సారిగా.. గుండెను మెట్రోలో తరలించి చరిత్ర సృష్టించారు హైదరాబాద్ మెట్రో అధికారులు. 21 కిలోమీటర్లు.. 16 సేషన్లను దాటి దాదాపు అరగంట లోపే జూబ్లీహీల్స్ మెట్రోస్టేషన్‌కి గుండెతో చేరుకుంది మెట్రో. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న స్పెషల్ వాహనంలో ఆసుపత్రికి తరలించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది మెట్రో.
ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హ్యట్సాఫ్ చెప్పాల్సిందే. అందరికంటే ముందుగా గుండెను దానం చేసిన రైతు కుటుంబానికి వందనం చేయాలి. వెంటనే స్పందించిన ఆసుపత్రి వర్గాలకు, సమన్వయంతో నడిచిన పోలీసులు, మెట్రో అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరూ అభినందనీయులనే చెప్పాలి.
Also Read ;- వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కల బదులు శానిటైజర్











