Police Baton Charge On Mokshagna Birthday Celebrations At Vadlamoodi Center In Guntur :
నిజమే.. ఇప్పుడు ఏపీలో పాలన.. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అన్న చందంగా మారిపోయింది. వైసీపీకి చెందిన వారు ఏం చేసినా.. నిబంధనలకు ఎంతమేర పాతరేసినా.. తమ ప్రత్యర్థిపై హత్యాయత్నం చేసినా.. చివరకు హత్య చేసినా కూడా పట్టించుకునే నాథుడు లేడు. అదే సమయంలో వైసీపీకి చెందని వారు.. ఇందులోనూ టీడీపీకి చెందిన వారు.. అందులోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు.. ఏం చేసినా, తప్పు చేయకున్నా.. పోలీసులు విరుచుకుపడుతున్నారు. లాఠీలతో తెగ బాదేస్తున్నారు. గొడ్డును బాదినట్టు బాదేస్తున్నారు. ఇదీ గడచిన కొంత కాలంగా ఏపీలో సాగుతున్న పాలనా తీరు. దీనిపై ఏ ఒక్కరికీ సందేహాలు అవసరం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ తరహా ఘటనలు కోకొల్లలుగా మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి కదా.
మోక్షజ్ఞ బాలు అల్లుడే కదా
ఈ తరహా జగన్ పాలనలో మంగళవారం నాడు మరో సంచలన ఘటన నమోదు అయ్యింది. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తారక రామ తేజ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులోని వడ్లమూడి సెంటర్ లో విజ్ఞాన్ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారంతా వడ్లమూడి సెంటర్‌కు వచ్చారు. బాలయ్య అంటే.. సినిమా హీరోగానే కాకుండా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడుగా, టీడీపీ ఎమ్మెల్యేగా సత్తా చాటుతున్నారు కదా. ఈ క్రమంలో బాలయ్యకు హీరోగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. మరి బాలయ్య కుమారుడు, త్వరలోనే తెరంగేట్రం చేస్తాడని భావిస్తున్న మోక్షజ్ఞ అంటే కూడా ఓ మోస్తరు హడావిడి ఉంటుంది కదా. అందుకే విజ్ఞాన్ వర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను కాస్తంత గ్రాండ్ గానే నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.
కరోనా ఆంక్షలు ఉల్లంఘించారట
వడ్లమూడి సెంటర్ కు భారీ ఎత్తున విజ్ఞాన్ వర్సిటీకి చెందిన విద్యార్థులు వచ్చారని, మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను భారీగా నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ఏదో సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు వచ్చిన నిరసనకారులను తరిమేందుకు కర్రలు, పెద్ద పెద్ద లాఠీలు చేతబట్టి వచ్చే మాదిరిగా రంగంలోకి దిగిన పోలీసులు..విద్యార్థులపై విరుచుకుపడ్డారు. అయితే విద్యార్థులు కూడా పోలీసులను నిలువరించి తామేం తప్పు చేశాం.. ఎందుకు కొడుతున్నారంటూ నిలదీశారు. దీంతో కరోనా ఆంక్షలను ఉల్లఘించేలా ఇంతమంది ఒకే చోట చేరి బర్త్ డే వేడుకలు నిర్వహిస్తారా? అంటూ ఆన్సర్ ఇస్తూనే విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. పోలీసుల వైఖరి అర్థమైన విద్యార్థులు రక్షణ కోసం పరుగులు పెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ చేపట్టే కార్యక్రమాలకు భారీ ఎత్తున జనం హాజరైతే గుర్తుకు రాని కరోనా ఆంక్షలు.. చంద్రబాబు వర్గానికి చెందిన వారి కార్యక్రమాల విషయంలోనూ గుర్తుకు వస్తాయా? అన్న దిశగా జగన్ సర్కారుతో పాటు ఏపీ పోలీసులపై సెటైర్లు పడుతున్నాయి.
Must Read ;- లోకేశ్ దెబ్బకు జగన్ దిగిరావాల్సిందే