Indians Have The Upper Hand In All Fields Than Americans In America :
విద్య కోసమో, ఉపాధి కోసమే.. విదేశాల వైపు చూస్తున్న భారతీయుల తొలి ఎంపిక అగ్రరాజ్యం అమెరికానే. అందుకే కాబోలు.. ఏ ఇతర దేశంలో లేనంత మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. ఇప్పటికే అక్కడికెళ్లిన చాలా మంది భారతీయులు ఆ దేశ శాశ్వత పౌరసత్యం పొందితే.. మరికొంత మంది ఆ రేసులో ఉన్నారు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. అమెరికాలో ఉంటూ.. ఆ దేశ పౌరుల కంటే కూడా అన్నింటా భారతీయులు మెరుగ్గా రాణిస్తున్నారు. ఈ విషయాన్ని మన దేశం గొప్పగా చెప్పుకునే దిశగా మనం చెబుతున్న మాట కాదు. ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సర్వే చేసి తేల్చిన నిజం ఇది. ఈ సర్వే అమెరికాలోని అమెరికన్లతో పాటు ఆ దేశంలో నివసిస్తున్న అన్ని దేశాలకు చెందిన వారి వివరాలను సేకరించి మరీ జరిగినది. ఈ సర్వే భారతీయుల సత్తా ఏమిటో మరోమారు నిరూపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ సర్వే తేల్చిందిదే
ఈ సర్వే ప్రకారం అమెరికన్ల కన్నా ఆ దేశంలోని మనోళ్ళదే పైచేయిగా ఉందని తేల్చింది. అమెరికాలోని ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రూ.92 లక్షలుంటే.. అదే అమెరికన్ల ఆదాయం రూ.47 లక్షలేనట. అంటే అమెరికన్ల సగటు ఆదాయం కన్నా ప్రవాస భారతీయుల సగటు ఆదాయం రెండింతలుందన్న మాట. ఇక భారతీయుల తర్వాత చైనా, ఫిలిప్పీన్స్ వాసులున్నారట. అత్యధిక వేతనాలు ఐటీ, ఆర్థిక, వైద్య రంగాల్లో వస్తోంటే.. వీటన్నింటిలోనూ మనోళ్ళదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. అమెరికాలోని మొత్తం డాక్టర్లలో భారతీయుల వాటా 9 శాతమట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంపాదనతో పాటు చదువులో కూడా చాలా దేశాలతో ప్రధానంగా అమెరికన్లతో పోల్చుకుంటే మన దేశ జనాలే ఎందుకు ముందంజలో ఉన్నారని ఈ సర్వే చెప్పేసింది. అమెరికాలో కాలేజీ గ్రాడ్యుయేట్లు 34 శాతం ఉంటే.. ఈ 34 శాతంలో 79 శాతం వాటా భారతీయులదేనట. ఇక అమెరికాలో ప్రవాస భారతీయులు 40 లక్షల మంది ఉంటే.. వీరిలో వీసాల మీదున్న వారి సంఖ్య 16 లక్షలు. శాశ్వత పౌరసత్వం తో ఉన్న వారి సంఖ్య 14 లక్షలట. మరో 10 లక్షల మంది అమెరికాలోనే పుట్టారట.
మనకున్న బలం ఏమిటంటే..?
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా కచ్చితంగా అక్కడ భారతీయులు ఉంటారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడని తత్వమే భారతీయులను విశ్వవ్యాప్తంగా విస్తరించేట్లు చేసింది. అంతేకాకుండా ఏ దేశ వాతావరణంలో అయినా ఇట్టే ఇమిడిపోయే మనస్తత్వం కూడా మనకే ఎక్కువ. ఈ లక్షణాలే అమెరికాకు వలస పోయిన మనోళ్లు.. అక్కడ సత్తా చాటుతున్నారు. ఇందుకు నిదర్శనంగా టాప్ కంపెనీల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు మనోళ్లే అధిపతులుగా ఉన్నారని చెప్పాలి. ఇక సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు ఏమాత్రం తగ్గకుండా.. అమెరికా వెళ్లిన ప్రతి భారతీయుడు కూడా తనదైన రీతిలో సత్తా చాటుతున్నారన్న దిశగా ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ సర్వే తేల్చిందన్న మాట.
Must Read ;- ఇండియన్స్ కు అమెరికా గుడ్ న్యూస్