సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.ప్రత్యేక గదిలో ఈ పరీక్షలు నిర్వహించారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ అధికారిగా హైకోర్టు రిజిస్ట్రార్ నాగార్జున నియమితులయ్యారు.వైద్య పరీక్షలు జ్యుడిషియల్ అధికారి సమక్షంలో ముగ్గురు వైద్యులు పూర్తి చేశారు. రక్త నమూనాలను సేకరించారు.కాగా రఘురామ కృష్ణం రాజు కుడి కాలు నొప్పి తీవ్రంగా ఉండడంతో ఉదయం చికిత్స చేసినట్టు తెలుస్తోంది.సోమవారం రాత్రి కూడా వైద్యులు కొన్ని మందులు ఇచ్చినట్టు తెలుస్తోంది.కాగా ఇంటర్నల్ పెయిన్స్ పైనే వైద్యుల బృందం చికిత్స అందస్తున్నట్లు సమాచారం.ఈ వైద్య పరీక్షలను వీడియో తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆర్మీ వీడియో తీస్తోంది.
రఘురామకృష్ణంరాజు చెప్పే ప్రతి అంశాన్ని..
కాగా ఈ వీడియోతోపాటు రఘురామకృష్ణంరాజు చెప్పే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.వైద్య పరీక్షల అనంతరం సీల్డు కవర్లో ఆ నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా సర్వోన్నత న్యాయస్థానానికి అందజేయనున్నారు.తమ తదుపరి ఆదేశాలు అందేవరకు రఘురామకృష్ణంరాజును ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంచాలని,జ్యుడిషియల్ కస్టడీగా భావించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కుటుంబసభ్యులను, న్యాయవాదులకు కూడా అనుమతి లేదని చెబుతున్నారు.రఘురామరాజు కుటుంబ సభ్యులకు కేవలం ఫోన్ ద్వారా సంక్షిప్తంగా రికార్డెడ్ సమాచారం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రఘురామరాజుకు అయిన గాయం ఏంటి..ఎందుకు, ఎప్పుడు ఆ గాయమైంది అనేది ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చే నివేదికలో తేలనుంది.మే 21న సుప్రీంకోర్టు రఘురామరాజు బెయిల్ పిటిషన్‌పై మరోసారి విచారణ జరపనుంది.
రాత్రి 11గంటల సమయానికి చేరిక..
కాగా రఘురామరాజుని మే14న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అయితే తనను పోలీసులు కొట్టారని చెబుతూ రఘురామరాజు సంచలన ఆరోపణల చేశారు.ఈ క్రమంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు విజయవాడ రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.అయితే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే పరీక్షలు చేయించిన అధికారులు రమేష్ ఆసుపత్రిలో పరీక్షలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో రఘురామరాజు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు.సోమవారం ఈ కేసుపై విచారణ జరిగింది.విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు,రఘురామరాజు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.ఇరువురి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం రఘురామరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించాలని, జ్యుడిషియరీ ఆఫీసర్ సమక్షంలో పరీక్షలు జరగాలని,వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ అయినా ఏపీ ప్రభుత్వం రఘురామరాజుని సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించే విషయంలో జాప్యం చేసిందనే విమర్శలూ వచ్చాయి.సాయంత్రం గుంటూరు జిల్లా జైలు నుంచి 6.30 గంటలకు తరలింపు ప్రక్రియ మొదలైంది. పలు అభ్యంతరాల నడుమ రఘురామరాజుని సొంత వాహనంలో తీసుకెళ్లేందుకు సీఐడీ అనుమతించింది.రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు రఘురామరాజు.సుప్రీం ఆదేశాల మేరకు ఆయనకు Y కేటగిరి భద్రత కూడా కొనసాగుతోంది.
Must Read ;- సుప్రీంకు రఘురామరాజు వైద్య పరీక్షల నివేదిక











