నర్సాపురం వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌కి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజుకి వై కేటగిరి భద్రతను కొనసాగిస్తూ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ టీం ఈ పరీక్షలు నిర్వహిస్తుందని, తమ ఆదేశాలను జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని ఆదేశించింది.వైద్య పరీక్షలను జ్యుడిషియల్ ఆఫీసరు సమక్షంలో వీడియో తీయాలని ఆదేశిస్తూ జ్యుడిషియల్ ఆఫీసర్ నియామక బాధ్యతలను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అప్పజెప్పింది.అదే సమయంలో తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆర్మీ ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు తనను కొట్టారని..
కాగా మే14న ఏపీ సీఐడీ రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ చేయడంతోపాటు ప్రాణ హాని ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు.ఆయన సతీమణి రమాదేవి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు రఘురామకృష్ణరాజుకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి,విజయవాడ రమేష్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలని సూచించింది.అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం అరికాళ్ల రంగు మారిందని చెప్పడంతో పాటు గాయాలు లేవని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ తరుణంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు శనివారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది.
జస్టిస్ వినీత్ శరన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ..
జస్టిస్ వినీత్ శరన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ జరపగా రఘురామ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ,ఆదినారాయణ వాదించారు.ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. వాదనల్లో భాగంగా బెయిల్ మంజూరుతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సాయం అందించాలని రఘురామరాజు తరఫు న్యాయవాదులు విన్నవించారు.ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలని దిగువ న్యాయస్థానం ఆదేశించినా అమలు కాలేదని,రఘురామరాజు కాళ్లకు గాయాలున్నాయని, దీంతోపాటు వైఎస్ జగన్ బెయిల్ రద్దుకు రఘురామరాజు పిటిషన్ వేసిన నేపథ్యంలో తమకు పలు అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. రఘురామరాజుకి బెయిల్ రాకూడదనే దురుద్దేశంతోనే కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టుకి తెలియజేశారు. రఘురామరాజుపై ఎలాంటి ఫిర్యాదు లేకుండా సీఐడీ స్వయంగా విచారణకు పూనుకుందని,నిబంధనలకు విరుద్దంగా, నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేశారన్నారు.అరెస్టు సమయంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరును,వీడియోలను న్యాయస్థానానికి సమర్పించారు.గత ఏడాది డిసెంబర్‌లో రఘురామరాజుకు బైపాస్ సర్జరీ జరిగిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఎయిమ్స్ పాలకవర్గంలో ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు
ఇక ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.రమేష్ ఆస్పత్రిపై ఆరోపణలున్నాయని చెప్పడంతో పాటు మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వంపై రఘురామరాజు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.దీనిపై రఘురామరాజు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వెలిబుచ్చారు.మంగళగిరి ఎయిమ్స్ పాలకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సభ్యులుగా ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఆర్మీ ఆసుపత్రికి సంబంధించి వివరాలు అడిగింది.వైజాగ్‌లో నేవీ ఆసుపత్రి ఉందని,సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆసుపత్రి ఉందని రఘురామరాజు తరపు న్యాయవాదులు తెలిపారు.వైజాగ్ నేవీ ఆసుపత్రి 300కిలోమీటర్ల దూరం ఉండడంతో తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుందని, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు,వైద్య చికిత్సలకు అభ్యంతరం లేదన్నారు.ఈ క్రమంలో ఆర్మీ విభాగాన్ని ఇందులోకి లాగడం రాజకీయం అవుతుందనే అభ్యంతరాలు వ్యక్తం కాగా సుప్రీంకోర్టు ఆ అభ్యంతరాలను తోసిపుచ్చింది.జ్యుడిషియల్ అధికారిని నియమిస్తున్నామని తెలిపింది.ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఉత్తర్వుల జారీ అయ్యేవరకు ప్రస్తుతం జారీచేసిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని వ్యాఖ్యానించింది.కాగా ఆసుపత్రిలో కేవలం వైద్య పరీక్షలు మాత్రమే జరపాలని, అడ్మిషన్‌కు అవకాశం ఇవ్వద్దని ప్రభుత్వం తరఫు వాదనను విన్న న్యాయస్థానం అందుకు సంబంధించి ప్రత్యేక నివేదిక గురువారం లోగా ఇవ్వాలని ఆదేశించింది. బెయిల్‌పై విచారణను మే 21కి వాయిదా వేసింది.
Must Read ;- రఘురామ కేసులో మరో మలుపు.. సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్