( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్‌లో అష్టకష్టాలు పడే జీవీఎంసీ, అంతర్జాతీయ స్థాయిలో మాత్రం సత్తా చాట గలిగింది. అంతర్జాతీయ అవార్డుల రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్–2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. మొత్తం ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం గర్వించదగ్గ విషయం.
వచ్చే ఏడాది మొదటి స్థానం సాధించగలమని జీవీఎంసీ కమిషనర్ జి. సృజన ఆశాభావం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్ దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం చెప్పుకోదగ్గ విషయం. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు.
అన్ని అర్హతలు ఉన్నా..
అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ స్థానం దక్కించుకునే అర్హతలు జీవీఎంసీకి ఉన్నప్పటికీ, అరకొర నిధులు కారణంగా అనేక ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. అనేక స్మార్ట్ సిటీ నగరంలో కనిపించని వనరులు, వసతులు విశాఖలో ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల మధ్య సమన్వయ లోపం, నిధుల విడుదలలో జాప్యం కారణంగా జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు జీవీఎంసీ టాప్ టెన్ ర్యాంకుల మధ్య ఏదో ఒక ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తులోనైనా నిధుల కొరత లేకుండా ప్రాజెక్టులను పరుగులు తీయిస్తారేమో వేచి చూడాలి.
Must Read ;- బ్రేక్ : ఈ భయంతోనే వారు అర్ధరాత్రి కూల్చేశారా?











