ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్లు అమ్మే ఏర్పాటు చేయడంపై తెలుగు చిత్ర పరిశ్రమ మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై ప్రభుత్వంలో చర్చలు జరిపితే తప్ప ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేలా లేదు.
మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి చర్చిస్తే తప్ప దీనికి పరిష్కారం లభించేలా లేదు. అప్పటికీ పరిష్కారం కాకపోతే ఈ జీవోపై కోర్టు ద్వారా పరిష్కారం లభించవచ్చన్న సినీ పరిశ్రమ పెద్దల్లో ఉంది. ఈ జీవో వల్ల కొన్ని మైనస్ లూ ఉన్నాయి, కొన్ని ప్లస్ లూ ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు మాత్రం ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించేవారు కూడా ఉన్నారు.
మేలు జరుగుతుందనే వారి వాదన
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి మేలు, సినీ పరిశ్రమకు మేలు, ప్రేక్షకులకు మేలు అనే మూడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో పన్ను ఎగ్గొట్టేవారి ఆటలు మాత్రం సాగవు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి శ్లాబ్ సిస్టమ్ ఎత్తేశాక థియేటర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఏ థియేటర్ ఎన్ని టిక్కెట్లు అమ్మిందో ఎవరికీ తెలియదు. కేవలం ఇప్పుడు ఆన్ లైన్లో అమ్మే టిక్కెట్ల ప్రకారమే టాక్స్ కట్టి మిగిలిన మొత్తాన్ని ఎగ్గొడుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ల రేట్లను భారీ గా పెంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు నష్టపోతున్నారు.
నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉండటం లేదు. రూ. 5వేలు, రూ. 10 వేలకు కూడా టిక్కెట్లు అమ్మిన రోజులున్నాయి. సినిమాని హైప్ చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కువ రేట్లకు అమ్ముకునే అనుమతిని ప్రభుత్వం ఇచ్చినప్పుడు తమకు కూడా ప్రతిఫలం ఉండాలని ప్రభుత్వం ఆశించడం సహజం. అలాగే ఆ నలుగురి గుత్తాధిపత్యంలోనే థియేటర్ వ్యవస్థ ఉందన్న ఆరోపణలు ఎప్పటుంచో ఉన్నాయి. ఈ కరోనా కాలంలో ఆ నలుగురూ థియేటర్ల అద్దెలు చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
దీని వల్ల అసలు థియేటర్ల యజమానులు నష్టపోయారు. థియేటర్ వ్యవస్థ ఆ నలుగురి చేతి నుంచి బయటపడితే చిన్న సినిమాల నిర్మాణం పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు చిన్న నిర్మాతలకు ఓటీటీ ఓ వరప్రసాదంగా మారింది. హీరోల రెమ్యూనరేషన్లు తగ్గిపోవడం వల్ల చిత్ర నిర్మాణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సినిమా నిర్మణంలో సగభాగం నటీనటుల పారితోషికాలకే సరిపోతుంది. మరో అంశం ఏమిటంటే ఎగ్జిబిట్లర్లు, డిస్ట్రిబ్యూటర్లు లెక్కల్లో జిమ్మిక్కులు చేయడం కుదరదు.
కీడు జరుగుతుందనే వారి వాదన
ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ అమ్మకాలు జరిపితే మళ్లీ ఆ డబ్బు తిరిగి ఎప్పుడు చేతికి వస్తుందోనన్న ఆందోళన ఉంది. ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. అందులో హోంశాఖ, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శులు, ఐ అండ్ పీఆర్ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి, కృష్ణు, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఉంటారు. ఈ కమిటీలో సినిమా రంగ వ్యక్తులకు మాత్రం చోటు లభించలేదు. దీనివల్ల నిర్ణయాలు ఏకపక్షంగా ఉండే ప్రమాదముంది.
ఈ నెల 4వ తేదీన సినీ పెద్దలతో సీఎం జగన్ సమావేశం జరగాల్సి ఉంది. దాన్ని రద్దు చేశారా? సినిమా పెద్దలే వెళ్లలేదా? అన్నది మాత్రం తెలియలేదు. ప్రభుత్వపరంగా రాయితీలను సినీ పరిశ్రమ కోరుతోంది. అందులో టిక్కెట్ల ధర, సీట్ల పరిమితి అంశాలున్నాయి. ఒక్కటి మాత్రం నిజం ఏపీ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకూ మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ నిర్ణయం మీద నటులుగానీ, నిర్మాతలు గానీ ఎవరూ నోరువిప్పలేదు. సాధారణంగా థియేటర్ యజమానులు అడ్బాన్సుల రూపంలో డిస్ట్రిబ్యూటర్లకు కొంతమొత్తం ఇస్తారు.
వీటిని డిస్ట్రిబ్యూటర్లు ఆయా నిర్మాతలకు ఇస్తారు. సినిమా నిర్మాణంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంటుంది. కొత్త నిర్ణయం వల్ల ఆ అవకాశం కనిపించడం లేదు. థియేటర్ యజమాని నుంచి నిర్మాత వరకూ సాగే వ్యాపారంలో ప్రభుత్వ ప్రమేయం ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం. ఇందులో ఇప్పటిదాకా ప్రభుత్వ ప్రమేయం ఉండదు. థియేటర్లు కూడా ప్రేవేటువే. అలాంటప్పుడు ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్ మెంట్ ఎందుకని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు.
ప్రభుత్వ నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు భారమై తాము ఇబ్బందులుపడుతున్నామని వారు వాపోతున్నారు. బుక్ మై షో, పేటీఎం లనుంచి ఒకటి రెండు రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయని, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోడానికి నెల రోజులు సమయం పట్టడం ఇబ్బందికరమని వారంటున్నారు. ఏదేమైనా దీని మీద చర్చ మాత్రం జరగాల్సిందే.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- స్టార్ డమ్ కి కౌంట్ డౌన్.. చివరికి స్టార్ డామ్!











