(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
చేపల కూర .. ఒకరిని హత్య చేయించింది. ఏడుగురిని జైలు పాలు చేసింది. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును చేపల కూర దగ్గర జరిగిన గొడవ వల్ల ఒకరు మరణించగా ఏడుగురు వ్యక్తులు జైలు ఊచలను లెక్కిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే ప్రాణాలు తీస్తుంటాయి. అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. చేపల కూర విషయంలో జరిగిన ఓ వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరి హత్యకు దారి తీసింది. మొత్తం ఏడుగురిని జైలు పాలు చేసింది. ఈ ఏడుగురిలో ఒక్కరే హత్యకు పాల్పడగా, మిగిలిన వారంతా ఆ హత్యను దాచిపెట్టేందుకు, ఆ శవాన్ని ఖననం చేసేందుకు సహాయపడినవారు కావడం గమనార్హం. ఉత్తరాంధ్రలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బుడితి సమీపంలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు బుడితి సమీపంలో జరుగుతున్న రక్షిత మంచినీటి పథకం ట్యాంకు నిర్మాణ పనుల కోసం మూడు నెలల క్రితం వచ్చి అవలింగిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లిన ఆయన తనకు పరిచయం ఉన్న తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన పాలమూరి ప్రసాద్(60)ని తనతో పాటు ఈ నెల 21వ తేదీన అవలంగి గ్రామానికి తీసుకొని వచ్చాడు. వీరిద్దరూ స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరితో కలిసి ఆదేరోజు రాత్రి చేపల కూర చేసుకుని మద్యం తాగారు. చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్ మధ్య గొడవ తలెత్తింది. దీంతో పాండురంగారావు మంచం కోడుతో ప్రసాద్ తల, చేతులపై కొట్టడంతో మృతి చెందాడు.
దీంతో ప్రసాద్ మృతదేహాన్ని మిగిలిన ఇద్దరితో కలిసి చెత్త సేకరణ బండిలో తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న చెరువు గట్టుపై పాతి పెట్టారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనలో పాల్గొన్న ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Must Read ;- మేడం.. ఫుల్ వీడియో బయటపెడ్తే మీరు సేఫ్!











