మలయాళ చిత్రం జల్లికట్టు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవార్డుల విభాగం కోసం మన దేశం నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం.
93వ అకాడమీ అవార్డులకు రంగం సిద్ధమవుతోంది. ఈ రేసులో ఇంకా చాలా చిత్రాలు ఉన్నా చివరికి ఈ అవకాశం జల్లికట్టుకే దక్కింది. దాదాపు 27 చిత్రాలు ఈ రేసులో పోటీ పడ్డాయి. 2021లో 93వ అకాడమీ అవార్డులు ప్రకటించనున్నారు. ది డిసిపల్, శకుంతలాదేవి, షికారా, గుంజన్ సక్సేనా, చపాక్, ఎకే వర్సెస్ ఏకే, గులాబో సీతావో, భోంస్లే, చలాంగ్, చెక్ పోస్ట్, బిట్టర్ స్వీట్, చింటూ కా బర్త్ డే తదితర చిత్రాలు ఈ రేసులో పోటీ పడ్డాయి. ఇన్ని చిత్రాలను దాటుకుని జల్లికట్టును ఈ అవకాశం వరించింది.
ఈ సినిమా కథాంశం, ప్రొడక్షన్ క్వాలిటీ, దర్శకుడి ప్రతిభ.. ఈ అంశాలన్నీ ఈ సినిమా ఎంపికకు దోహద పడ్డాయని జ్యూరీబోర్డ్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రాహుల్ రావెల్ తెలిపారు. మనం జంతువుల కన్నా అధ్వానంగా ఉన్నామనే విషయాన్ని ఈ సినిమా తేటతెల్లం చేసిందన్నారు. ఇలాంటి సినిమాని చూసి మనమంతా గర్వించాలన్నారు. జల్లికట్టు చిత్రానికి లిజో జోస్ పెల్లి స్సేరి దర్శకత్వం వహించారు. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్ తదితరులు ఈ సినిమాలో నటించారు.
దర్శకుడి ప్రతిభా పాటవాలను ఎంతోమంది అభినందించారు. ఇంతకు ముందు ఫిలిం ఫెస్టివల్ లో కూడా జల్లికట్టుకు అవార్డు వచ్చింది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. మనిషికీ, మృగానికీ ఉన్న తేడాను స్పష్టం చేసిన చిత్రమిది. 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాని ప్రదర్శించారు. ఆ తర్వాత 24 వ బుసాన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శించారు. 50 వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) లో జల్లికట్టు దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 50 వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలోనూ జల్లికట్టుకు రెండు ఉత్తమ అవార్డులు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సౌండ్ మిక్సింగ్ పురస్కారాలు లభించాయి. గత ఏడాది ‘గల్లీబోయ్’ చిత్రం మన దేశం తరఫున ఆస్కార్ కు వెళ్లింది. చివరి నిమిషంలో అవకాశం చేజారింది. 2002లో అమీర్ ఖాన్ ‘లగాన్’ సినిమా ఇలా వెళ్లింది. విలేజ్ రాక్‌స్టార్స్, న్యూటన్, కోర్ట్, విసరానై, బర్ఫీ, ఇండియన్, పీప్లి లైవ్ తదితర చిత్రాలు గతంలో ఇలా నామినేట్ అయ్యాయి. ఈ ఆస్కార్ రేసులో జల్లికట్టుకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. సాధారణంగా 2021లో ఫిబ్రవరి 25న ఈ అవార్డులు ప్రకటించాలి. ఈ సారి ఏప్రిల్ 25కు మార్చారు. చూడాలి ఏంజరుగుతుందో.
Must Read ;- భారత తొలి ఆస్కార్ విజేత కన్నుమూత











